వలంటీర్లకు రాజకీయాలొద్దు

Feb 7,2024 09:42 #Chandrababu Naidu, #speech

-ప్రజలకు మంచి చేసే వారికి సహకరిస్తాం

-వైసిపికి సేవ చేస్తే మాత్రం జైలుకు పంపిస్తాం

‘రా… కదిలిరా’ బహిరంగ సభలో చంద్రబాబు

ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో:వలంటీర్లకు రాజకీయాలొద్దని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు హితవు పలికారు. ‘రా… కదలిరా’ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా జీడీనెల్లూరులో మంగళవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. టిడిపి ప్రభుత్వం వస్తే వలంటీర్లను తొలగిస్తారని వైసిపి తప్పుడు ప్రచారం చేస్తోందని, కావాలనే వారిలో అభద్రతా భావం సృష్టిస్తోందని విమర్శించారు. వలంటీర్లకు తాము వ్యతిరేకం కాదన్నారు. ప్రజలకు మంచి చేసే వారికి సహకరిస్తామని తెలిపారు. వైసిపికి సేవ చేస్తే మాత్రం వదలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. జగన్‌కు నమ్ముకుంటే జైలుకు వెళ్తారని హెచ్చరించారు. దళిత ద్రోహి జగన్‌’ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దళిత ద్రోహి’ అని చంద్రబాబు విమర్శించారు. దళితుల ఉద్ధరణకు టిడిపి ప్రభుత్వం తీసుకొచ్చిన 27 పథకాలను రద్దు చేయడమే కాకుండా ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ను నిర్వీర్యం చేశారని వివరించారు. దళితుడిని హత్య చేసి డోర్‌ డెలివరీ చేసిన ఘనత వైసిపికే దక్కిందని దుయ్యబట్టారు. దళితుడైన బాలయోగిని టిడిపి హయాంలో పార్లమెంట్‌ స్పీకర్‌గా పంపించామన్నారు. చిత్తూరు జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో దళితులను వైసిపి మార్చిందని, ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నారాయణస్వామి… రెడ్లకు ‘జీ హుజూర్‌’ అనాల్సిన పరిస్థితి ఉందని విమర్శించారు. స్కూటర్‌లో తిరిగే పెద్దిరెడ్డికి రూ.35 వేల కోట్లు ఎలా వచ్చాయని సత్యవేడు దళిత ఎంఎల్‌ఎ ఆదిమూలం అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దొంగ ఓట్లు సృష్టించడంలో చంద్రగిరి ఎంఎల్‌ఎ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దిట్టని, ఎర్ర చందనాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆరోపించారు. కాబట్టే, ఆయనను ఒంగోలుకు ముఖ్యమంత్రి జగన్‌ ప్రమోషన్‌ ఇచ్చారని చంద్రబాబు దుయ్యబట్టారు. వైసిపి పాలనలో వేలాది టన్నుల ఎర్ర చందనం ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిపోతోందని విమర్శించారు. స్మగ్లర్లు పోలీసులపై దాడులకు, హత్యలకు పాల్పడుతున్నారని, ఎఆర్‌ కానిస్టేబుల్‌ హత్యే దీనికి తాజా నిదర్శమని అన్నారు. ఓట్ల దొంగలు ఉన్నారు… జాగ్రత్తరాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారని చంద్రబాబు విమర్శించారు. ప్రతి ఓటరు తమ ఓటు ఉందో? లేదో? చెక్‌ చేసుకోవాలని సూచించారు. వైసిపి పాలనలో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, కార్మికులకు, రైతులకు, మహిళలకు ఇలా… అందరికీ అన్యాయం జరిగిందని, అందరికీ ద్రోహం చేసిన పార్టీ వైసిపియేనని విమర్శించారు. రాజకీయ కక్షలు, వేధింపులతో పారిశ్రామికవేత్తలను, వ్యాపారులను రాష్ట్రం నుంచి తరిమేస్తోందని దుయ్యబట్టారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న అమరరాజా అధినేత గల్లా జయదేవ్‌ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు స్వయంగా ప్రకటించడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సభలో మాజీ మంత్రి అమరనాథరెడ్డి, చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నాని, పూతలపట్టు అభ్యర్థి మురళీమోహన్‌, తిరుపతి పార్లమెంట్‌ అధ్యక్షులు నరసింహ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️