విద్యార్థి దశలోనే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి : టీటీడీ చైర్మన్‌

తిరుపతి : విద్యార్థి దశలో సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే జీవితకాలం సౌకర్యవంతంగా ఉండొచ్చని టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి విద్యార్థులకు సూచించారు. తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో ఉన్న హరిణి హాస్టల్‌ బ్లాకులో అదనంగా నిర్మించిన భవనాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజువారి పుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలను చదివితే జ్ఞానం పెరుగుతుందని తెలిపారు. రూ.14 కోట్లతో నాలుగు ఫ్లోర్లతో నూతన భవనం నిర్మించినట్టు, మొత్తం 112 గదుల్లో 672 మంది విద్యార్థినులకు అదనంగా బస కల్పించే వెసులుబాటు కలిగిందని చెప్పారు.

ఇందులో 5 స్డడీ రూమ్‌లు, రిక్రియేషన్‌ హాలు, 105 స్నానపు గదులు, 105 మరుగుదొడ్లు ఉన్నాయన్నారు.కళాశాలలో మొత్తం 2,800 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారని, నూతన భవనం నిర్మాణంతో మొత్తం 1850 మందికి హాస్టల్‌ వసతి సమకూరిందని చెప్పారు. టీటీడీ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులందరికీ హాస్టల్‌ వసతి కల్పించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ఒక మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానమని చెప్పారు.అనంతరం జేఈవో వీరబ్రహ్మంతో కలిసి మొక్కలు నాటారు.

➡️