విశాఖలో భారీగా పట్టుబడ్డ ఇ – సిగరెట్లు

Mar 24,2024 21:55 #e cigaretes, #seaze, #visakhapatnam

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) :విశాఖ నగరంలో నిషేధిత ఇ-సిగరెట్లు పట్టుబడడంతో కలకలం రేగింది. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. విశాఖ జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ ఫకీరప్ప కేసు వివరాలను ఆదివారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ఇటీవల నగరంలోని ఓ ప్రయివేట్‌ కళాశాలలో నిర్వహించిన ఆకస్మిక దాడులలో మూడు ఇ-సిగరెట్లు దొరికాయి. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే నగరంలోని మీరా కలెక్షన్‌ సమీపంలోని ఫుట్‌పాత్‌పై ఇ-సిగరెట్లు విక్రయిస్తున్న సన్నీ కర్నాని, దస్‌పల్లా హిల్స్‌ రోడ్డుపై దేజావు రెడీమేడ్‌ క్లాత్‌ షాప్‌ నిర్వహిస్తున్న హబీబ్‌ ఖాన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 743 ఇ – సిగరెట్లును స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్‌ విలువ సుమారు రూ.22 లక్షలు ఉంటుంది. బహిరంగ మార్కెట్లో ఒక్కో సిగరెట్‌ను నిందితులు రూ.3 వేలకు విక్రయిస్తున్నారు. ఈ నిషేధిత ఇ-సిగరెట్లలో ప్రాణాంతకమైన మత్తు పదార్థం నికోటిన్‌ ఉంటుంది. ఇది ఊపిరితిత్తులను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇ-సిగరెట్లు బ్యాటరీ కలిగి ఉంటాయని, రీ-ఛార్జ్‌ చేసుకోవొచ్చని జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ ఫకీరప్ప తెలిపారు. వీటిని ముంబయికి చెందిన అశోక్‌ శ్యామ్‌ కటారా నుంచి కొనుగోలు చేసినట్టు నిందితులు చెప్పినట్టు వెల్లడించారు. వీడియో సమావేశంలో డిసిపి -1 మణికంఠ చందోలు, త్రీటౌన్‌ ఎస్‌ఐ పార్థసారథి పాల్గొన్నారు.

➡️