రిమాండ్‌ గిరిజన ఖైదీ మృతి

Feb 7,2024 20:30 #crime

– జైలు సిబ్బందే కారణమని బంధువుల ఆరోపణ

– మార్చురీ వద్ద నిరసన

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖ) :విశాఖపట్నం సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం రూడకోట పంచాయతీ బడంబీరు గ్రామానికి చెందిన గిరిజనుడు కోడ పోతన్న (40) కెజిహెచ్‌లో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. సెంట్రల్‌ జైలు సిబ్బంది, అధికారులు హింసించడం వల్లనే మరణించాడని మృతుని భార్య తూలమ్మ ఆరోపించారు. మృతిపై సందేహం వ్యక్తపరుస్తూ కెజిహెచ్‌ వద్ద గిరిజనులు ఆందోళనకు దిగారు. మార్చురీ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తూలమ్మ మీడియాతో మాట్లాడారు. ఆమె కథనం ప్రకారం.. గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్నాడన్న అభియోగంపై 2003 జులై 27న పోలీసులు కొట్టి, హింసించి, కేసు పెట్టి కోర్టుకు తరలించారు. కోర్టు ఆదేశం మేరకు రిమాండ్‌ ఖైదీగాసెంట్రల్‌ జైలుకు తరలించారు. రిమాండ్‌లో ఉన్న తన భర్త గురించి తూలమ్మ అల్లుడు శంకరరావు, ఫోన్‌లో వాకబు చేశారు. అతని ఆరోగ్యం బాగాలేదని, కెజిహెచ్‌లో జాయిన్‌ చేసినట్టు జైలు సిబ్బంది చెప్పారు. చోడవరంలో ఉన్న శంకరరావు వెంటనే కెజిహెచ్‌కు వెళ్లారు. ఆసుపత్రిలో బెడ్‌పై ఉన్న పోతన్న నోరు, ముక్కు నుంచి రక్తం వస్తున్నట్లు గుర్తించి, ఫొటోలు తీసి తూలమ్మకు, మరియు బంధువులకు పంపాడని, రాత్రి 11 గంటల సమయంలో కెజిహెచ్‌కు వచ్చి చూడగా ఏ వార్డులోనూ పోతన్న కనిపించలేదు. ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించగా ఆయన చనిపోయినట్లు, మార్చురీలో మృతదేహాన్ని భద్రపరిచినట్లు తెలిపారు. తన అల్లుడు పంపిన ఫొటోలను బట్టి చూస్తే, తన భర్తను సెంట్రల్‌ జైలు సిబ్బంది, అధికారులు హింసించినట్లుగా కనిపిస్తోందని తూలమ్మ ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. తనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారని, తామంతా తన భర్త పోతన్న సంపాదన పైనే ఆధారపడి జీవిస్తున్నామని రోదించారు.

➡️