వైసిపి అరాచకాలను తిప్పికొట్టాలి

-‘నిజం గెలవాలి’లో భువనేశ్వరి

ప్రజాశక్తి-కలసపాడు (వైఎస్‌ఆర్‌ జిల్లా):ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేసే నియంతృత్వ పరిపాలనను, అరాచకాలను ప్రజలు ఓటు అనే ఆయుధంతో తిప్పి కొట్టాలని చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కోరారు. ‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా ఆమె శుక్రవారం వైఎస్‌ఆర్‌ జిల్లాల్లో పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. బి.కోడూరు మండలం గుంటపల్లికి చెందిన ఓబుల్‌రెడ్డి, కలసపాడు మండలం లింగారెడ్డిపల్లెకు చెందిన సగిలి డేవిడ్‌, బ్రాహ్మణపల్లెకు చెందిన నల్లగుండ్ల వెంకటయ్య, తెల్లపాడుకు చెందిన బసిరెడ్డి చెంచిరెడ్డి కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించి ఓదార్చారు. మృతుల చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. వైసిపి ఐదేళ్ల పాలనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేక ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కార్యకర్తలకు సముచిత న్యాయం చేస్తామని అన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, టిడిపి రాష్ట్ర యువ నాయకులు రితీష్‌రెడ్డి, పాల్గొన్నారు.

➡️