సంపూర్ణ వందేమాతరం గీతాలాపనతో బాలగాయకుడు ధీరజ్‌ ప్రపంచ రికార్డు

Mar 23,2024 22:45 #dheeraj, #world record

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) :భారత జాతీయోద్యమ స్ఫూర్తి రగిల్చిన వందేమాతర గీతాన్ని నిర్విరామంగా 77 సార్లు ఆలపించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు విశాఖకు చెందిన బాల గాయకుడు దొంతంశెట్టి ధీరజ్‌. అతని ప్రతిభకు భారత్‌ టాలెంట్స్‌ బుక్‌ అఫ్‌ రికార్డ్‌లో స్థానం లభించింది. పాడుతా తీయగా, సూపర్‌ సింగర్‌ కాంటెస్ట్‌ విజేతగా నిలిచిన ధీరజ్‌ తాజాగా ఈ రికార్డు నెలకొల్పారు. శనివార విశాఖలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో భారత్‌ టాలెంట్స్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ ధ్రువపత్రాన్ని ధీరజ్‌కు డాక్టర్‌ నందవాడ కిరణ్‌ అందజేసి, ఘనంగా సత్కరించారు. ధీరజ్‌ మాట్లాడుతూ.. పాఠశాలల్లో వందేమాతర గీతాన్ని సరైన రీతిలో సంపూర్ణంగా ఆలపించడంపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నానని తెలిపారు. ‘కలిసి పాడుదాం వందేమాతరం’ శీర్షికతో కొన్ని నెలలుగా 40 పాఠశాలల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చానన్నారు. ఈ తరుణంలో మదిలో మెదిలిన సంకల్పమే సంపూర్ణ వందేమాతర నిర్విరామ గీతాలాపన అని తెలిపారు. తన తల్లిదండ్రులు రాజేష్‌, రాణిల ప్రోత్సాహంతో తనకీ గుర్తింపు వచ్చిందని చెప్పారు. అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వి డెంటల్‌ హాస్పటల్‌ డైరెక్టర్‌ కెఎంకె.రమేష్‌ మాట్లాడుతూ.. వందేమాతర ఉద్యమ స్ఫూర్తిని పునర్నిర్మించడానికి ధీరజ్‌ చేస్తున్న ప్రయత్నం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జూనియర్‌ ఛాంబర్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ప్రతినిధి సబ్బవరపు రాజశేఖర్‌, నాట్యాచార్య కె.వెంకట్‌, డాక్టర్‌ ఇ.శ్రీ విద్య, అమ్మా బ్లడ్‌ బ్యాంకు అధినేత దాసరి శివగుప్తా, వాసవి క్లబ్‌ ప్రతినిధి కె.అనిల్‌ కుమార్‌, వి హెల్త్‌ కేర్‌ చీఫ్‌ మేనేజర్‌ సిహెచ్‌.కృష్ణ, కె.రమ్య పాల్గొన్నారు.

➡️