సమ్మె విచ్ఛినాన్నికి కుట్రలు

Dec 15,2023 08:47 #Anganwadi Workers, #Dharna

– అంగన్‌వాడీ సెంటర్‌ల తాళాలు పగలకొట్టిన అధికారులు

– అడ్డుకున్న లబ్ధిదారులు, అంగన్‌వాడీలు

– బెదిరింపులతో ఆయాకు గుండెపోటు

– బొబ్బిలి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి

– రాష్ట్ర ఫుడ్‌ కమిటీ ఛైర్మన్‌ కాన్వారు అడ్డగింత

ప్రజాశక్తి – యంత్రాంగం :అంగన్‌వాడీల సమ్మె విచ్ఛినాన్నికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. సమస్యలను పరిష్కరించకుండా కుట్రలకు పాల్పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగలకొట్టించి, సచివాలయ సిబ్బందికి బాధ్యతలు అప్పగించింది. వారికి సహకారులుగా వలంటీర్లను నియమించింది. కొన్ని చోట్ల సెంటర్ల తాళాలను అధికారులు బద్దలు చేస్తుండగా అంగన్‌వాడీ లబ్ధిదారులు, అంగన్‌వాడీలు అడ్డగించారు. సమస్యలను పరిష్కరించమంటే ఇలా తాళాలు పగులగొట్టడం ఏమిటని అధికారులను ప్రశ్నించారు. ఇలాంటి అణచివేత చర్యలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి, కాకినాడ జిల్లా, డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ జిల్లాలో తహశీల్దార్‌, ఐసిడిఎస్‌ కార్యాలయాల వద్ద సమ్మె శిబిరాలు నిర్వహించారు. యు.కొత్తపల్లిల్లో అంగన్‌వాడీ కేంద్రం తాళాలు పగలగొట్టడాన్ని స్థానిక మహిళలు అడ్డుకుని అంగన్‌వాడీలకు బాసటగా నిలిచారు. సీతానగరంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సచివాలయ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. పెద్దాపురంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఐవి మద్దతుగా పాల్గని మాట్లాడారు. సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడటం తగదన్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని అన్ని మండల కేంద్రాల్లో తహశీల్దార్‌ కార్యాలయాల ఎదుట నిరసన తెలిపారు. శింగనమల మండల కేంద్రంలో భిక్షాటన చేశారు. హిందూపురంలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన ర్యాలీ చేపట్టి అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతపురం జిల్లాలోని రాయదుర్గం, గుమ్మఘట్ట, శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని నల్లచెరువు, రొద్దం తదితర ప్రాంతాల్లో అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టారు. వైఎస్‌ఆర్‌ జిల్లాలోని ముద్దనూరు, జమ్మలమడుగు, చింతకొమ్మదిన్నెలో సెంటర్ల తాళాలు పగలకొట్టారు. ముద్దనూరులో అంగన్‌వాడీ కేందానికి తాళాలు పగలగొట్టడంపై ఎస్‌ఐకి అంగన్‌వాడీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. పోరుమామిళ్లలో బబ్బిలి ఎమ్మెల్యే దిష్టబమ్మను దగ్ధం చేశారు.శ్రీకాకుళంలో అంగన్‌వాడీ లబ్ధిదారులు తమ పిల్లలను తీసుకుని సమ్మె శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. చిత్తూరు జిల్లాల్లోని 11 ప్రాజెక్టులో సచివాలయ సిబ్బందిని రెవెన్యూ అధికారులు వెంటబెట్టుకొని సాయంత్రం నాలుగు గంటల సమయంలో అంగన్‌వాడీ సెంటర్ల తాళాలు పగులగొట్టే ప్రయత్నం చేశారు. కొన్నిచోట్ల లబ్దిదార్లు, అంగన్‌వాడీలు అడ్డుకోవడంతో వెనుదిగారు. మరికొన్ని ప్రాంతాల్లో బలవంతంగా తాళాలు పగలగొట్టి సెంటర్లలోకి ప్రవేశించారు. ఏలూరు జిల్లా పెదపాడులో నోట్లో పచ్చగడ్డి, ఎండు గడ్డి పెట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అనంతరం ర్యాలీగా వెళ్లి జగదాంబ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. లక్కవరం అంగన్‌వాడీ కేంద్రం తాళాలను అధికారులు పగలగొట్టారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర, ఆచంట మండలాల్లో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు.నంద్యాల జిల్లా వ్యాప్తంగా మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. కర్నూలు ధర్నా చౌక్‌లో దీక్షలు చేపట్టారు. దీక్షలకు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఏ.గఫూర్‌ మద్దతు తెలిపారు. సమస్యలు పరిష్కారం అయ్యే పోరాటం కొనసాగించాలని అంగన్‌వాడీలను కోరారు. నెల్లూరు అర్బన్‌ ప్రాజెక్టు పరిధిలోని ఐసిడిఎస్‌ పీడీ ఆఫీసు, కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లోనూ ఆందోళనలు కొనసాగాయి.అంగన్‌వాడీలపై బబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని కోరుతూ పలుచోట్ల రాస్తారోకోలు చేశారు. అధికారుల ఆదేశాలతో విజయనగరం, బబ్బిలి, సాలూరు, పార్వతీపురం పట్టణాలతోపాటు పలు మండలాల్లో సచివాలయ సిబ్బంది అంగన్‌వాడీ కేంద్రాలను తెరిచారు. బబ్బిలి పట్టణంలో 46 కేంద్రాలను తెరించారు. జామి మండల కేంద్రంలో అల్లువీధి పాఠశాలలో అంగన్‌వాడీ కేంద్రాన్ని ఎంపిడిఒ సతీష్‌ ఆధ్వర్యాన తెరిచేందుకు ప్రయత్నించగా, చిన్నారుల తల్లిదండ్రులు అడ్డుకున్నారు. ఎన్‌టిఆర్‌ జిల్లా విస్సన్నపేట, పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం మండలాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలన్నింటినీ తాళాలు పగలగొట్టి, సచివాలయాల సిబ్బందికి అప్పగించారు. అనకాపల్లి జిల్లా మునగపాక అంగన్‌వాడీ కేంద్రం తాళం కప్పను సచివాలయ కానిస్టేబుల్‌ పగలగొట్టి తలుపులను తెరిచే ప్రయత్నం చేయగా విషయం తెలుసుకున్న సిఐటియు నాయకులు అడ్డుకున్నారు. అల్లూరి జిల్లా ముంచింగిపుట్టు మండలం సుజనకోట, కిలగడ, అనంతగిరి మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రం – 2, రాజవొమ్మంగి మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రం – 2 తాళాలను బద్దలుకొట్టి లోపలకు వెళ్లేందుకు అధికారులు ప్రయత్నించగా అంగన్‌వాడీలు అడ్డుకున్నారు. చింతపల్లిలో రాష్ట్ర ఫుడ్‌ కమిటీ ఛైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డి కాన్వారును అంగన్వాడీ కార్యకర్తలు అడ్డుకున్నారు.అధికారుల బెదిరింపులతో ఆయాకు గుండెపోటుఅధికారుల బెదిరింపులతో శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో ఓ అంగన్‌వాడీ ఆయా గుండెపోటుకు గురయ్యారు. అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు ఇవ్వాలని, ఇకపై విఒల సాయంతో ఆంగన్‌వాడీ సెంటర్లు నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని ఐసిడిఎస్‌ సూపర్‌ వైజర్‌ బెదిరింపులకు దిగారు. ఈ మాటలతో చిలమత్తూరు అంగన్‌వాడీ కేంద్రం ఆయా పార్వతమ్మ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పితో కుప్పకూలిపోయారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.సమస్యలు పరిష్కరించకుంటే తెలంగాణ గతేజివిఎంసి గాంధీ విగ్రహం వద్ద అంగన్‌వాడీల సమ్మెకు ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి మద్దతు తెలుపుతూ మాట్లాడారు. జగన్‌మెహన్‌రెడ్డి ప్రభుత్వం అంగన్‌వాడీలపై నిర్బంధం ప్రయోగించడం ద్వారా ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఎన్‌టిఆర్‌ జిల్లా విజయవాడలోని ధర్నా చౌక్‌లో అంగన్‌వాడీలు చేస్తున్న పోరాటానికి ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు, ఉద్యోగ, ఉపాధ్యాయ, సిఐటియు, ఇతర సంఘాల నేతలు సంఘీభావం తెలిపి, సమ్మెలో పాల్గన్నారు. లక్ష్మణరావు మాట్లాడుతూ.. సమస్యలను పరిష్కరించకుండా మొండికేసినట్లయితే తెలంగాణ గతే పడుతుందని హెచ్చరించారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్ఫర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెసుబ్బరావమ్మ మాట్లాడుతూ… సమస్యలను పరిష్కరించకపోతే త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి మహిళలు రిటన్‌గిప్ట్‌ ఇస్తారని హెచ్చరించారు. యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నక్కా వెంకటేశ్వర్లు, ఎఎస్‌ఎస్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ…అంగన్‌వాడీలు చేస్తున్న న్యాయమైన పోరాటానికి ఉపాధ్యాయ సంఘాలు సంపూర్ణ మద్దతునివ్వడంతో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

➡️