సిఎఎకు బాబు వత్తాసు

-దేశం కోసం ఆమోదించాలని వ్యాఖ్యా

ముస్లిం దేశాల్లో మనం ఉండగలమా అని ప్రశ్న

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఎన్నికల వేళ నరేంద్రమోడీ ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వత్తాసు పలికారు. దేశంకోసం దానిని ఆమోదించాలన్నారు. ఒక దశలో ఆయన మనం ముస్లిం దేశాల్లో ఉండగలమా? అని ప్రశ్నించారు. ఇటువంటివి లేకపోతే సంఘ వ్యతిరేక శక్తులు దేశంలోకి వచ్చేస్తాయని చెప్పారు. ఉండవల్లిలోని బాబు నివాసంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ సిఎఎ అమలుపై ముస్లిం మైనార్టీ వర్గాల్లో ఆందోళన నెలకొని ఉంది. దీనిపై వైసిపి, టిడిపి ఇంతవరకు స్పందించలేదు…’ అంటూ ఒక విలేకరి బాబును ప్రశ్నించడంతో ఆయన ..’ అది ఆ రాష్ట్రాలకే కదా.. ఇక్కడ కాదు కదా,,,’ అని స్పందించారు. ఆ తరువాత తన జవాబును కొనసాగిస్తూ ‘అందరం ఏ దేశానికి పోయినా, ఇప్పుడు మనం దుబారుకు పోతే పౌరసత్వం లేదా?ఆలోచించండి. ఎప్పుడో ఒక సారి వీటన్నింటిని సరిదిద్దుకోవాలి. నీవు అమెరికాకు వెళ్తే ఉంటావా? తెలుగోళ్లంతా అమెరికాకు వెళ్లారు. ఆ దేశంతో అనేక దేశాలకు వెళ్లారు. ఏ దేశం వెళ్లినా అక్కడ పౌరసత్వం లేదా? పాస్‌పోర్టు లేదా? మరి ఎట్లా?’ అని అన్నారు. ‘ఇవ్వనీ రాజకీయం చేస్తే రాజకీయం. ఎవరికి అభద్రత ఉంటుంది. ఎవరైనా దొంగతనంగా వస్తే అటువంటి వారికి అభద్రత భావం ఉంటుంది. వాళ్లు రావొచ్చు. వాళ్లు రావచ్చు. యాంటీ సోషల్‌ ఎలిమెంట్స్‌ కూడా రావచ్చు ఇక్కడికి. కొన్ని కొన్ని స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఉద్యోగాలు… ఎస్‌ ..4 శాతం! మనం కాపాడుతాం. రెండవ ఆలోచన లేదు. ఎందుకు? ఈ రోజు ముస్లింల్లో కూడా పేదరికం ఉంది. ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారు. వాళ్లకు చేయూత ఇవ్వడం మన బాధ్యత, అది ఇస్తాం.’ అని చెప్పారు. ‘కానీ.. సిటిజన్‌ షిప్‌…. ఎవరైనా వస్తాం… ఎక్కడైనా ఉంటాం అంటే, రేపు రాబోయే రోజుల్లో దేశానికి భద్రత ఎలా ఉంటుంది?’ అని ప్రశ్నించారు. ‘నేను పోయేసి పాస్‌పోర్టు లేకుండా సింగపూర్‌లో ఒక్క రోజు ఉంటానా…మీరు చెప్పండి నాకు… మీరు ఉంటారా ఎక్కడన్నా ప్రపంచంలో..పోనీ ముస్లిం దేశాల్లో మనం ఉంటామా?’ అని ప్రశ్పించారు. ‘హిందూ దేశాలని కాదు. క్రిస్టియన్‌ దేశాలని కాదు. ముస్లిం దేశాలని కాదు. ఎక్కడైనా సరే పౌరసత్వం అనేకది పారదర్శకంగా ఉంటుంది. ఎవరైనా మైగ్రేట్స్‌ వెళ్తాం. ఇమిగ్రేట్స్‌గా ఉంటాం. కొన్ని రోజులు పాస్‌పోర్టుపై ఉంటాం. అవసరమైతే ఆ దేశ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకొని పౌరసత్వం పొందుతాం అంతేకదా?. అమెరికాలో కూడా గ్రీన్‌కార్డు ఇస్తున్నారు. వాళ్లు కలుపుకుంటున్నారు. అక్కడే సెటిల్‌ అవుతున్నారు. ఇవి అన్ని ప్రొసెస్‌లో ఉంటాయి. దాన్ని కావాలని కొంతమంది రాజకీయం చేయడం కూడా కరెక్ట్‌ కాదు.’ అని చెప్పారు. ఎవరైనా దేశంకోసం ఆలోచించే ఏ వ్యక్తి అయినా సరే కొన్ని కొన్ని ఆమోదించాలి. రాజకీయాలకు అతీతంగా ముందుకు పోవాలి.మనకు కూడా కొంత క్రమ శిక్షణ ఉండాలి’ అని ఆయన అన్నారు. చంద్రబాబు ఇచ్చిన సమాధానం చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ముస్లింలకు తప్ప ఇతర మతస్తులకు పౌరసత్వాన్ని మంజూరు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు తన సమాధానంలో సంఘ విద్రోహ శక్తులు (యాంటి సోషల్‌ ఎలిమెంట్స్‌) అని ప్రస్తావించారు. అంటే, ముస్లింలలోనే అటువంటి శక్తులు ఉంటాయని బాబు చెబుతున్నారా? ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపిలు చెబుతున్నది అదే కదా! ఇది తెలుగుదేశం పార్టీ అనుసరించిన గత విధానాలకు భిన్నం. అదే విధంగా ‘ముస్లిం దేశాల్లో మనం ఉంటామా..’ అని ప్రశ్నించడం కూడా ఇటువంటిదే! ఆ తరువాత ‘ హిందూ దేశాలు, క్రిస్టియన్‌ దేశాలు, ముస్లిం దేశాలు’ అని ఆయన సర్దుకున్నప్పటికీ…టిడిపి నాయకుల నుండి గతంలో ఎప్పుడు ఇటువంటి భాషను వినని విషయం తెలిసిందే! అమెరికా ఇచ్చే గ్రీన్‌ కార్డు, నరేంద్రమోడీ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన సిఎఎ ఒకటే అన్న విధంగా మాట్లాడటం, అభద్రతలో ఉండే మైనార్టీలకు ధైర్యం చెబుతూ వారి తరపున మాట్లాడుతున్న వారిని రాజకీయం చేస్తున్నారని అనడంతో లౌకిక విలువలను టిడిపి వదిలిపెట్టేసినట్టేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పైగా దేశభక్తితో ముడిపెట్టే విధంగా మాట్లాడటం, క్రమశిక్షణ గురించి ప్రస్తావించడం ఏ స్థాయిలో ఏ చంద్రబాబు మోడీకి, బిజెపికి దాసోహమంటున్నారో తెలియచేస్తోంది.

➡️