సైన్స్‌తోనే సమాజాభివృద్ధి

Feb 7,2024 08:24 #K Venkateswara Rao, #speech

– జిల్లా విద్యాశాఖాధికారి కె వెంకటేశ్వరరావు

– రాష్ట్ర స్థాయి సైన్స్‌ కళాజాతా ప్రారంభం

ప్రజాశక్తి – శ్రీకాకుళం :అర్బన్‌శాస్త్రీయ దృక్పథాన్ని అలవరుచుకుని, సృజనాత్మకతను పెంపొందించుకుని మూఢనమ్మకాలను విడనాడాలని జిల్లా విద్యాశాఖ అధికారి కె వెంకటేశ్వరరావు అన్నారు. శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలిలోని ఎన్‌టిఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ ఆవరణలో మంగళవారం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యాన రాష్ట్ర స్థాయి సైన్స్‌ కళాజాతాను ఆయన ప్రారంభించారు. ఈ నెల 18న అనంతపురంలో ఈ జాతా ముగియనుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్స్‌తోనే సమాజాభివృద్ధి సాధ్యమన్నారు. శాస్త్ర, సాంకేతికత విజ్ఞానాన్ని భవిష్యత్‌ తరానికి అందించినప్పుడే దేశం అన్నిరంగాల్లో ముందడుగు వేస్తుందని తెలిపారు. మూఢనమ్మకాల పంజరాల్లో చిక్కుకున్న ప్రజలను విజ్ఞాన రంగాల వైపు మళ్లించేలా యువత ముందుకు రావాలని కోరారు. డిప్యూటీ డిఇఒ విజయ కుమారి మాట్లాడుతూ మూఢనమ్మకాలను సమాజం నుంచి దూరం చేయాలని పిలుపునిచ్చారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి జి మురళీధర్‌ సైన్స్‌ కళాజాతా విశిష్టతను వివరించారు. జాతాలో కళా బృందాలు మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా చైతన్యం కల్పించేలా నాటికలు, గీతాలతో కళారూపాలను ప్రదర్శించాయి. కార్యక్రమంలో విశ్రాంత డిఇఒ బి మల్లేశ్వరరావు, రెడ్‌క్రాస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి జగన్మోహనరావు, పూర్వ డైట్‌ ప్రిన్సిపల్‌ కె అప్పారావు, గరిమెళ్ల అధ్యయన వేదిక అధ్యక్షులు విజికె మూర్తి, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి జి గిరిధర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️