సిఇఒ ఎదుటకు 3 జిల్లాల ఎస్‌పిలు

– పల్నాడు, నంద్యాల, ప్రకాశం జిల్లాల ఘటనలపై ఎలక్షన్‌ కమిషన్‌ సీరియస్‌
– శాంతిభద్రతల విషయంలో రాజీపడబోమని స్పష్టీకరణ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలు, పల్నాడు జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న భద్రతా ఉల్లంఘనలు, ఇతరత్రా అంశాలపై ఆయా జిల్లాల ఎస్‌పిలు గురువారం ఎన్నికల కమిషన్‌ను కలిసి వివరణ ఇచ్చారు. ఈ ఘటనలపై తమ ఎదురుగా వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా ఆదేశించారు. దీంతో ఆ మూడు జిల్లాల ఎస్‌పిలు ఎ రఘువీర్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి సచివాలయానికి చేరుకుని సిఇఒ మీనా, లా అండ్‌ ఆర్డర్‌ ఎడిజి బాగ్చితో సమావేశమై వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరిని విడివిడిగా పిలిచి వివరణ తీసుకున్నారు. శాంతిభద్రతలు కాపాడే విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారని ప్రశ్నించారు. హత్యలు జరిగేంతలా పరిణామాలు చోటుచేసుకోవటంపై సిఇఒ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. మాచర్ల ప్రాంతంలో చాలా కాలం నుంచి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా ఎందుకు కంట్రోల్‌ చేయలేదని సిఇఒ ప్రశ్నించినట్లు తెలిసింది. అలాగే భవిష్యత్‌లో ఇలాంటి చర్యలు జరిగితే సహించబోమని, వీటి పట్ల కఠినంగా వ్యవహరించాలని తేల్చిచెప్పినట్లు తెలిసింది. ముగ్గురు ఎస్‌పిల నుంచి తీసుకున్న వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘం పంపబోతుంది.
మరోవైపు వైసిపి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైసిపి నాయకులు అంకం నారాయణమూర్తి తదితరులు సిఇఒను కలిసి టిడిపిపై ఫిర్యాదు చేశారు. నారా భువనేశ్వరి, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, రాయచోటి టిడిపి అభ్యర్థి రామ్‌ప్రసాద్‌ రెడ్డి ‘న్యాయం గెలవాలి’ పేరుతో బాధితులకు చెక్కులు పంపిణీ చేస్తూ, కోడ్‌ ఉల్లంఘించారని ఫిర్యాదు చేశారు. అలాగే టిడిపి నేత రామాంజనేయులు వైసిపి నేతపై దాడి చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని సిఇఒను కోరారు.

➡️