హైదరాబాద్‌ లో 7 కొత్త కేసుల నమోదు

Dec 21,2023 15:25 #Covid Cases, #hyderabad

హైదరాబాద్‌ : కరోనా గురించి యావత్‌ ప్రపంచం మరిచిపోతున్న తరుణంలో మళ్లీ కరోనా భూతం బెంబేలెత్తిస్తోంది. కరోనా కొత్త వేరియంట్‌ జేఎన్‌.1 కలవరపెడుతోంది. మన దేశంలో కూడా కొవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 358 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనా కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ మూడు మరణాలు కూడా కేరళలో సంభవించాయి. కొవిడ్‌ సబ్‌ వేరియంట్‌ జేఎన్‌.1ను తొలుత కేరళలో గుర్తించారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే గత 24 గంటల్లో కొత్తగా 6 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ హైదరాబాద్‌ లోనే నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం 14 మంది కొవిడ్‌ చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఏపీలో కూడా కొత్త వేరియంట్‌ కేసులు నమోదయినట్టు సమాచారం. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. కరోనా కట్టడికి అన్ని చర్యలను చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు మాస్క్‌ లు ధరించాలని ప్రజలకు సూచించాయి.

➡️