న్యాయ సంహిత సెక్షన్‌ 106 రద్దు చేయాలి

ఎఐఆర్‌టిడబ్ల్యు ప్రధాన కార్యదర్శి ఆర్‌ లక్ష్మయ్య

ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి జిల్లా :ఆటో డ్రైవర్లకు ప్రమాదకరంగా ఉన్న భారత న్యాయ సంహిత సెక్షన్‌ 106 రద్దు చేయాలని ఆలిండియా రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్‌ లక్ష్మయ్య డిమాండ్‌ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సుందరయ్య భవనంలో మంగళవారం కాట్రేడ్డి వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో ఉన్న ఐపిసిలోని 304 సెక్షన్‌ ప్రకారం డ్రైవర్లకు ప్రమాదం జరిగినప్పుడు ఉన్న అవకాశాన్ని తీసేసి డ్రైవర్లకు భారీ జరిమానా, శిక్షలు వేసే విధంగా నూతన చట్టాలను తీసుకొచ్చారని విమర్శించారు. దేశవ్యాప్తంగా పది కోట్ల మంది రవాణా రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. అటువంటి రంగాన్ని పెద్ద పెద్ద కంపెనీలకు అప్పగించడానికి ప్రభుత్వం సిద్ధమైందన్నారు. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్లు మాత్రమే కారణమని, అందుకోసం కొత్త చట్టాలను తీసుకొస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం సరికాదన్నారు. రోడ్ల ప్రమాదాలకు కారణం డ్రైవర్లు మాత్రమే కాదని, జాతీయ రహదారుల నిర్మాణ లోపం ఉందని చెప్పారు. ప్రమాదాలు జరిగితే వాటి కారణాలను పరిశీలించే కమిటీలను వేయడం లేదన్నారు. డీజిల్‌, పెట్రోల్‌ ధరలు విపరీతంగా పెంచడంతో రవాణా రంగ కార్మికులపై విపరీతమైన భారం పడిందన్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 16న దేశ వ్యాప్తంగా జరిగే సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ సభలో సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, బంకురు ప్రసాద్‌, గాజుల నాగేశ్వరరావు, పోతు వెంకటరమణ, పి సురేష్‌ మాట్లాడారు.

➡️