మెరిసిన బాలికలు

Apr 22,2024 23:27 #10th class exams, #release
  • ‘పది’ ఫలితాల్లో వారిదే పైచేయి
  •  599 మార్కులు సాధించిన నాగ మనస్వి
  •  మొత్తం 86.69శాతం ఉత్తీర్ణత

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పదో తరగతి ఫలితాల్లో బాలికలు పై చేయి సాధించారు. పరీక్షలకు బాలికలు 3,02,005 మంది హాజరవ్వగా 2,69,307(89.17శాతం) ఉత్తీర్ణుల య్యారు. బాలుర ఉత్తీర్ణత శాతం 84.32 మాత్రమే కావడం గమనార్హం. మొత్తం 3,14,610 మంది బాలురు పరీక్షలకు హాజరుకాగా 2,65,267 మంది ఉత్తీర్ణత సాధించారు. ఏలూరు జిల్లా నూజివీడులోని ముసునూరు మండలం రమణక్క పేటకు చెందిన ఆకుల వెంకటసాయి నాగ మనస్వి అత్యధికంగా 599 మార్కులు సాధించారు. మార్చి 18వ తేది నుంచి 30వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్షల ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌కుమార్‌ సోమవారం విజయవాడలోని విడుదల చేశారు. 6,23,128 మంది విద్యార్ధులు పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా 6,16,615 మంది హాజరయ్యారు. వీరిలో 5,34,574 మంది (86.69శాతం) ఉత్తీర్ణులయినట్లు ఆయన తెలిపారు. గతేడాది 72.74శాతం ఉత్తీర్ణత రాగా, ఈ ఏడాది 86.69శాతం నమోదైంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎపి రెసిడెన్షియల్‌, ఎపి బిసి వెల్ఫేర్‌ పాఠశాలలు 98.43శాతం సాధించాయి. ప్రైవేట్‌ పాఠశాలల్లో 96.72శాతం నమోదైంది. జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో 79.38శాతం, మున్సిపల్‌ పాఠశాలల్లో 75.42శాతం, ప్రభుత్వ పాఠశాలల్లో 74.40శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 2803 పాఠశాలల్లో అందరూ ఉత్తీర్ణులవ్వగా , 17 పాఠశాలల్లో ఒక్కరూ కూడా పాస్‌ కాలేదు. 4,27,067 మంది ప్రధమ శ్రేణి, 73,200 మంది ద్వితీయ శ్రేణి, 34,307శాతం మంది తృతీయ శ్రేణి సాధించారు. ఫలితాల్లో 96.37శాతంతో పార్వతీపురం మన్యం, 93.35శాతంతో శ్రీకాకుళం జిల్లాలు ప్రధమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. 62.47శాతంతో చివరి స్థానంలో కర్నూలు జిల్లా నిలిచింది. తెలుగు మాధ్యమంలో 1,61,881 మంది హాజరవ్వగా 1,15,060 (71.08శాతం) మంది, ఇంగ్లీష్‌ మీడియంలో 4,50,304 మందికి గానూ 4,15,743(92.32శాతం) మంది, హిందీలో రాసిన 12 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉర్దూలో రాసిన 2,616 మందిలో 2300(87.92శాతం), కన్నడలో 658 మందికి 374(56.84శాతం), తమిళంలో 260 మందికి 246(96.42శాతం), ఒడియాలో 884 మందికి 839(94.91శాతం) చొప్పున ఉత్తీర్ణత శాతం నమోదైంది. తెలుగు సబ్జెక్టులో 96.47శాతం, హిందీలో 99.24శాతం, ఇంగ్లీష్‌లో 98.52శాతం, గణితంలో 93.33శాతం, జనరల్‌ సైన్స్‌లో 91.29శాతం, సోషల్‌ స్టడీస్‌లో 95.34శాతం పాసయ్యారు. మార్కుల జాబితాలను నాలుగు రోజుల తర్వాత అధికారిక వెబ్‌సైట్‌ www.bse.ap.gov.inలో అందుబాటులో ఉంటాయన్నారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్కూల్‌ లాగిన్‌ నుంచి మార్కుల మెమోరాండం, వ్యక్తిగత షార్ట్‌మెమోలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. విద్యార్ధులు www.results.bse. ap.gov.in వెబ్‌సైట్‌ నుంచి స్కూల్‌కు వెళ్లకుండానే షార్ట్‌ మెమోలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని తెలిపారు.

మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
ఫెయిలైన విద్యార్ధులకు మే 24 నుంచి జూన్‌ 3 వరకు సప్లిమెంటరీ ఫలితాలను నిర్వహిస్తామని కమిషనర్‌ సురేష్‌కుమార్‌ వెల్లడించారు. సప్లిమెంటరీకి హాజరయ్యేందుకు, రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ కోసం విద్యార్ధులు ఈ నెల 23 నుంచి 30 వరకు ఫీజు చెల్లించాలని తెలిపారు. అపరాధ రుసుం రూ.50లతో మే 1 నుంచి 23 వరకు చెల్లించవచ్చునని పేర్కొన్నారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ డి దేవానందరెడ్డి, సిమ్యాట్‌ డైరెక్టర్‌ విఎన్‌ మస్తానయ్య, సమగ్ర శిక్ష ఎఎస్‌పిడి కెవి శ్రీనివాసులురెడ్డి, ఎస్‌సిఇఆర్‌టి డైరెక్టర్‌ బి ప్రతాప్‌ రెడ్డి, కెజిబివి కార్యదర్శి డి మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.

➡️