13 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి 26న శంకుస్థాపన – డిఆర్‌ఎం ఎం.రామకృష్ణ

Feb 24,2024 08:27 #drm rakrishna, #press meet

ప్రజాశక్తి-గుంటూరుజిల్లా ప్రతినిధి :గుంటూరు డివిజన్‌ పరిధిలో 13 రైల్వేస్టేషన్‌ల అభివృద్ధికి శంకుస్థాపన, మరో పది ఆర్‌యుబిల ప్రారంభోత్సవం ఈ నెల 26న నిర్వహిస్తున్నట్టు డిఆర్‌ఎం ఎం.రామకృష్ణ తెలిపారు. గుంటూరులోని తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.221.42 కోట్లతో గుంటూరు, మంగళగిరి, నంద్యాల, గిద్దలూరు, కంభం, మార్కాపురం, నర్సరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, నడికుడి, మాచర్ల, మిర్యాలగూడ, నల్గండ స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్టు తెలిపారు. ఆయా స్టేషన్లలో వాణిజ్య సముదాయాలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ప్రయాణికులకు మౌలిక సదుపాయాలతోపాటు వాణిజ్య స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రకాశం జిల్లా కురిచేడు, పల్నాడు జిల్లా వినుకొండ, దాచేపల్లి, మనుమాక, గుంటూరు జిల్లా వేములూరిపాడు, కొప్పరావూరు, కంతేరు, తెలంగాణలోని నార్కెట్‌పల్లి, భదరం, కీసరాజుపల్లి రైల్వే గేట్ల స్థానంలో నిర్మించిన ఆర్‌యుబిలను జాతికి అంకిత చేయనున్నట్టు చెప్పారు. ఇందుకోసం రూ.36.28 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. భవిష్యత్తులో గుంటూరులోని పలు ప్రాంతాల్లో రైల్వే గేట్ల స్థానంలో ఆర్‌ఒబిలు, ఆర్‌యుబిలు నిర్మించాలని ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. ఎడిఆర్‌ఎంలు ఆర్‌.శ్రీనివాస్‌, కె.సైమన్‌, సీనియర్‌ డిసిఎం ప్రదీప్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️