రూ.1400 కోట్ల అవినీతి

Dec 19,2023 11:02 #Arogyashri
  • ఆరోగ్యశ్రీని భ్రష్టు పట్టించిన మాజీ ఎమ్మెల్యే కుమారుడు అశోక్‌రెడ్డి
  • వైసిపి రెబల్‌ నేత పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్‌ రెడ్డి ఆరోపణ

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి కుమారుడు అశోక్‌రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నారని, రూ.1400 కోట్లు అవినీతికి పాల్పడ్డా రని వైసిపి బహిష్కృత నేత పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. అశోక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని తన కార్యాల యంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అశోక్‌రెడ్డి పొదిలిలో సొంత ఆస్పత్రిని ఏర్పాటు చేసుకొని ఆరోగ్యశ్రీ ఎంప్యానల్‌మెంట్‌ ఉందంటూ చుట్టుపక్కల పేదల నుంచి ప్రతినెలా సుమారు రూ.55 లక్షలు వసూలు చేశారని ఆరోపించారు. ప్రశ్నించిన వారిపై సిఎం జగన్‌మోహన్‌రెడ్డికి తాను చెప్పిందే వేదమని చెబుతున్నారని, తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సిఇఒ తాను చెప్పిందే వింటారని, రాబోయే రోజుల్లో వైసిపి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు జగన్‌మోహన్‌రెడ్డి అవకాశం కల్పిస్తారంటూ ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. ఇప్పటివరకు అశోక్‌రెడ్డిపై రూ.1400 కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్నాయని, వైద్య వృత్తిని అప్రతిష్టపాలు చేస్తున్నారని విమర్శించారు. కరోనా సమయంలో రూ.100 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. వైద్య వత్తిని అడ్డం పెట్టుకొని లక్షలు దోచుకుంటున్న అశోక్‌రెడ్డి అవినీతిపై సిబిఐతో విచారణ చేయించి ఆరోగ్యశ్రీ ఎంప్యానల్‌మెంట్‌ రద్దు చేయాలని ప్రజలు కోరుతున్నారన్నారు.

➡️