15 మంది వలంటీర్లు తొలగింపు

ప్రజాశక్తి – ప్రొద్దుటూరు, పొదిలి :వైఎస్‌ఆర్‌ జిల్లాలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన 12 మందిని, ప్రకాశం జిల్లాలో ముగ్గురు వలంటీర్లను బుధవారం తొలగించారు. వైఎస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం మండల పరిధిలోని దొమ్మర నంద్యాల గ్రామంలో విధులు నిర్వహిస్తున్న 11 మంది వలంటీర్లు ఈ నెల 17న జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్‌రెడ్డి నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వలంటీర్లను ఎంపిడిఒ శంషాద్‌ భాను తొలగించారు. ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలోని 18వ వార్డు సచివాలయంలో వలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్న గోపిరెడ్డి వెంకట ధనుంజరు.. ఎన్నికల నియమావళికి విరుద్దంగా మంగళవారం 38వ వార్డులో వైసిపి ఎన్నికల ప్రచారంలో పాల్గన్నారని, దీంతో ఆయనను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని మున్సిపల్‌ కమిషనర్‌ రఘునాధరెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్ల పొదిలిలో వైసిపి ప్రచార కార్యక్రమంలో పాల్గన్న వలంటీర్లు జిలానీ, మజ్నువలీ, మందగిరి రమేష్‌ను విధుల నుంచి పొదిలి ఎంపిడిఒ గౌసియాబేగం తొలగించారు.

➡️