ఆంధ్ర వర్సిటీలో పోస్టల్‌ ఓటు కోల్పోయిన 150 మంది

అమరావతి: విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఒప్పంద ఉద్యోగులకు పోలింగ్‌ డ్యూటీ వేసిన అధికారులు.. వారు పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగించుకోకుండా చేశారు. వైసిపితో అంటకాగుతున్న కొందరు అధికారులు కావాలనే ఇలా చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ వర్సిటీలో పనిచేస్తున్న సుమారు 200 మంది ఒప్పంద ఉద్యోగులకు ఇతర పోలింగ్‌ అధికారులు (ఓపీఓ)గా డ్యూటీలు వేసినట్లు మంగళవారం ఆదేశాలనిచ్చి ఒక్క రోజులోనే బుధవారంలోపు పోస్టల్‌ బ్యాలట్‌ ఫాం-12 సమర్పించాలని సూచించారు. ఫాం-12 ఎక్కడ సమర్పించాలనే దానిపైనా స్పష్టతనివ్వలేదు. కొంతమందికి భీమిలి నియోజకవర్గంలో ఓటు ఉండడంతో అక్కడికి వెళ్లి ఇచ్చారు. మరికొందరు ఉత్తర, దక్షిణ నియోజకవర్గాలకు వెళ్లి సమర్పించగా.. చాలా మంది ఫాం-12 అసలు ఇవ్వనే లేదు. వాస్తవంగా వర్సిటీ తరఫున వాటిని తీసుకొని సహాయ రిటర్నింగ్‌ అధికారికి సమర్పిస్తే సరిపోతుంది. కానీ, ఒప్పంద ఉద్యోగుల ఓట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడతాయనే ఉద్దేశంతో ఇలా చేసినట్లు విమర్శలున్నాయి. దాదాపు 150 మంది ఫాం-12 సమర్పించలేకపోయారు. చిత్రమేమిటంటే.. నలుగురు ఒప్పంద ఉద్యోగులకు బుధవారం ఓపీఓలుగా డ్యూటీలు వేస్తున్నట్లు ఆదేశాలనిచ్చారు. వారు ఐదారు గంటల్లోనే ఫాం-12 ఎలా సమర్పిస్తారనే అంశాన్ని ఆలోచించలేదు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పే ఎన్నికల సంఘం ఇలాంటి వాటిపై ఎందుకు మౌనం వహిస్తోందో అర్థం కావడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఫాం-12 సమర్పించేందుకు వారం రోజులు గడువు పెంచాలని కోరుతున్నారు.

➡️