16న దేశవ్యాప్త నిరసనలో మెడికల్‌ రిప్స్‌ భాగస్వాములు కావాలి

– సిఐటియు అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్‌ సేన్‌ పిలుపు

– మెడికల్‌ రిప్స్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు ప్రారంభం

ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ :కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ కార్పొరేట్‌ మతోన్మాద విధానాలను తిప్పికొట్టాలని సిఐటియు అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్‌ సేన్‌ పిలుపునిచ్చారు. ఈ నెల 16న దేశవ్యాప్తంగా జరిగే గ్రామీణ బంద్‌, పారిశ్రామిక సమ్మెలో మెడికల్‌ రిప్స్‌ కూడా భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ మెడికల్‌ రిప్రజెంటేటివ్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు బుధవారం విజయవాడ గవర్నర్‌పేటలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో ప్రారంభమయ్యాయి. యూనియన్‌ జాతీయ అధ్యక్షులు రమేష్‌ సుందర్‌ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ హృద్రోగ వైద్య నిపుణులు డాక్టర్‌ పూర్ణానంద్‌ ఆహ్వాన సంఘం తరుఫున స్వాగతం పలికారు. సిఐటియు అఖిల భారత కార్యదర్శి కరుమల ఎన్‌ సమావేశాలను ప్రారంభించారు. ఈ సమావేశాల్లో తపన్‌సేన్‌ ముఖ్యఅతిథిగా పాల్గని మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా లేబర్‌ కోడ్లు తెచ్చిందని తెలిపారు. ప్రజల ఆస్తి అయిన ప్రభుత్వ రంగాన్ని ప్రయివేటుకు అప్పచెబుతోందన్నారు. ఢిల్లీలో జరిగిన రైతాంగ ఉద్యమం సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వారిని ఇబ్బందులు గురిచేస్తోందని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు కష్టాలు పడుతున్నారన్నారు. ఉపాధి కల్పన తగ్గిపోయి నిరుద్యోగం పెరిగిందన్నారు. కార్పొరేట్లకు మేలు చేసేలా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలిపారు. దేశ ప్రజల సమస్యలను పక్కతోవ పట్టించటానికి మతాన్ని అడ్డుపెట్టుకుంటోందన్నారు. ఈ వాస్తవాన్ని గమనించి ప్రజానుకూల విధానాల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కరుమల ఎన్‌ మాట్లాడుతూ ఫార్మా యాజమాన్యాలు ప్రజారోగ్యాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్ల లాభాలు సంపాదిస్తున్నాయని, మెడికల్‌ రిప్స్‌ సమస్యలను మాత్రం పట్టించుకోవడంలేదని అన్నారు. ప్రభుత్వ విధానాలూ దీనికి కారణమని తెలిపారు. ఈ సమావేశాలలో సిఐటియు అఖిల భారత నాయకులు జెఎస్‌ మజుందార్‌ యూనియన్‌ అఖిల భారత ప్రధాన కార్యదర్శి శంతన కుమార్‌ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు, ఆహ్వాన సంఘం కన్వీనర్‌ కృష్ణయ్య, బెఫి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ అజరు కుమార్‌, సిఐటియు ఎన్‌టిఆర్‌ జిల్లా అధ్యక్షులు ఎ వెంకటేశ్వరరావు, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ కన్వీనర్‌ ఎ కమల, అంగన్‌వాడి వర్కర్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శిఎం సిహెచ్‌ సుప్రజా, బీమా ఉద్యోగుల సంఘం, ఎల్‌ఆర్‌ఎస్‌ఎ, విద్యుత్‌ ఉద్యోగుల సంఘం, బిఎస్‌ఎన్‌ఎల్‌ రిటైర్డ్‌ ఉద్యోగుల నాయకులు పాల్గొన్నారు.

➡️