20న రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి- సిపిఎం, సిపిఐ రాష్ట్ర కమిటీల విజ్ఞప్తి

Feb 19,2024 07:59 #CPI, #cpm, #sadassu

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని, ఆ పార్టీతో జతకడుతున్న టిడిపి, జనసేన కూటమికి, నిరంకుశ వైసిపికి వ్యతిరేకంగా ఈ నెల 20న విజయవాడలో జరగనున్న రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ప్రజలకు, ప్రజాతంత్ర వాదులకు సిపిఐ, సిపిఎం రాష్ట్ర కమిటీలు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు ఉమ్మడి ప్రకటనను సిపిఎం రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి జె జయరాం ఆదివారం మీడియాకు విడుదల చేశారు. దేశంలో, రాష్ట్రంలో బిజెపి మతోన్మాద ప్రమాదం పెచ్చరిల్లిపోతోందని, స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో రూపొందించుకున్న రాజ్యాంగానికి ముప్పు ఏర్పడిందని పేర్కొన్నాయి. నిరంకుశత్వం రాజ్యమేలుతోందని, రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలు బిజెపికి అనుకూలంగా మలచుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందని తెలిపాయి. ప్రాంతీయ పార్టీల సహకారంతో బిజెపి బలపడే ప్రమాదం కనిపిస్తోందని, ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా, విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టిన విద్రోహ పార్టీ బిజెపి అని పేర్కొన్నాయి. పోలవరం, రాజధానికి నిధులివ్వకపోయినా తెలుగుదేశం, జనసేన పార్టీలు బిజెపి కొమ్ము కాస్తున్నాయని, వైసిపి పూర్తిగా లంగిపోయి అనధికార ఎన్‌డిఎ సభ్యులుగా కొనసాగుతోందని విమర్శించాయి. జనసేన ఇప్పటికే ఎన్‌డిఎలో ఉండగా, కొత్తగా తెలుగుదేశం చేరబోతోందని, ఈ పరిణామం రాష్ట్ర వినాశనానికి, మత సామరస్యం దెబ్బతినడానికి, సామాజిక న్యాయానికి విఘాతం కలగడానికి దారి తీస్తుందని తెలిపాయి. ఈ శక్తులను రానున్న ఎన్నికల్లో అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు. ప్రజలపై వైసిపి భారాలు వేయడమే కాకుండా ప్రశ్నిస్తున్న వారిని అణచివేస్తోందని, అవినీతి విస్తరిస్తోందని, ప్రకృతి సంపదను బడా కార్పొరేట్లపరం చేస్తోందని తెలిపాయి. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం ముందు తాకట్టు పెడుతోందని, ఈ మూడు పార్టీలు బిజెపికి లంగిపోయి ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని తెలిపాయి. ఈ పరిస్థితుల్లో బిజెపిని వ్యతిరేకించే లౌకిక పార్టీలు, రాష్ట్ర సమగ్రాభివృద్ధిని కోరుకునే పార్టీలు, సంఘాలు, సంస్థలు, వ్యక్తులు, శక్తులు ఉమ్మడి గళం వినిపించాలని, పరస్పరం సహకరించుకుని పనిచేయాలని కోరాయి. ఈ లక్ష్యంతో సిపిఎం, సిపిఐ రాష్ట్ర కమిటీలు ఫిబ్రవరి 20న ఉదయం 10 గంటలకు విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నాయి. ఈ సదస్సులో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులు గిడుగు రుద్రరాజు, సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు వి శ్రీనివాసరావు, కె రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే ఎంఎ గఫూర్‌, సిపిఐఎంఎల్‌ లిబరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌ మూర్తి, జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షులు వివి లకీëనారాయణ, విసికె పార్టీ రాష్ట్ర కార్యదర్శి విద్యాసాగర్‌, ఆర్‌ఎస్‌పి, ఫార్వర్డ్‌బ్లాక్‌, ఆమ్‌ఆద్మీ, ఎంసిపిఐయు పార్టీల నాయకులతో పాటు ఎస్‌కెఎం రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు, ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు చలసాని శ్రీనివాస్‌, వివిధ సంఘాల, సంస్థల ప్రతినిధులు పాల్గంటారని తెలిపాయి. అందరూ ఈ సదస్సులో పాల్గని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశాయి.

➡️