20 రోజులు పరీక్షా కాలం

Apr 23,2024 08:36 #2024 election, #andrapradesh
  • బ్యాంకుల్లో లావాదేవీలపై ప్రత్యేక దృష్టి
  •  రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనా నిగమ్‌

ప్రజాశక్తి – ఏలూరు : బ్యాంకుల్లో అధిక మొత్తంలో జరిగే నగదు లావాదేవీలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఆర్థిక లావాదేవీలు, ఖర్చులు, ఇతర వ్యయాలపై నిఘా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనానిగమ్‌ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశపు హాలులో వివిధ ఎన్నికల విభాగాల నోడల్‌ అధికారులు, వ్యయ పరిశీలకులతో సమీక్షించారు. ఈ సందర్భంగా నీనా నిగమ్‌ మాట్లాడుతూ ముఖ్యంగా బ్యాంకుల్లో అధిక నగదు మొత్తాల లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లా యంత్రాంగమంతా అప్రమత్తంగా పని చేస్తున్నప్పటికీ మరింత నిఘా అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ఏదైనా నగదు, ఇతర వస్తువులు పట్టుబడినప్పుడు అందుకు సంబందించిన దర్యాప్తు వేగవంతంగా ఉండాలని ఆమె స్పష్టం చేశారు. పోస్టల్‌ ఆర్డర్లు, యుపిఐ పేమెంట్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. మద్యం రవాణా సమయంలో సక్రమమైన సమయంలో చేరాల్సిన చోటుకు చేరిందా లేదా అనేది పరిశీలించాలన్నారు. జిల్లాలోని అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసి, మే, 13న నిర్వహించే సాధారణ ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు సమర్థవంతంగా పని చేయాలన్నారు. బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డిపాజిట్లు, నగదు ఉపసంహరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎక్కడైనా అనుమానాస్పద కేసులు గమనిస్తే, వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు.

➡️