21 నుండి లెనిన్‌ శత వర్ధంతి సభలు : సిపిఎం

cpm press meet on cyclone effect

ప్రజాశక్తి-విజయవాడ : శ్రామిక వర్గ విప్లవ నేత, 20వ శతాబ్దపు గొప్ప మార్క్సిస్టు మేధావి కామ్రేడ్‌ వి.ఐ.లెనిన్‌ శత వర్ధంతి 2024 జనవరి 21 నుండి ప్రారంభమై సంవత్సరం పొడవునా వివిధ రకాల కార్యక్రమాలు జరుగుతాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదర్భంగా 21వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా వర్ధంతి సభలు జరపాలని.. కమ్యూనిస్టు అభిమానులు, శ్రేయోభిలాషులు, ప్రగతిశీలవాదులు అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని నివాళి అర్పించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రపంచంలోనే మొట్టమొదటి శ్రామిక వర్గ రాజ్యం సోవియట్‌ యూనియన్ను సాధించిన ఘనత లెనిన్‌ నాయకత్వానికి దక్కుతుందన్నారు. కష్టపడి సంపద సృష్టించే వర్గాలు ”రైతులు, కూలీలు, కార్మికులు, మధ్యతరగతి ఉద్యోగులు, వత్తి దారులు” తదితరులకే సంపదపై అధికారం ఉండాలని, అలాంటి వారికే రాజ్యాధికారం కావాలని లెనిన్‌ పోరాడారని గుర్తుచేశారు. అసమానతలు లేని సోషలిస్టు సమాజ నిర్మాణానికి పునాదులు వేశారని.. అమానుషమైన పెట్టుబడిదారీ దోపిడీకి విరుగుడు సోషలిజమేనని ఆయన ఆచరణలో రుజువు చేశారన్నారు. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ దశలో ప్రజల సంపద కార్పొరేట్‌ పాలవుతున్న కాలంలో లెనిన్‌ ఆవశ్యకత మరింత పెరిగిందన్నారు.

భారతదేశ స్వాతంత్ర ఉద్యమాన్ని లెనిన్‌ గట్టిగా బలపరిచారని.. సామాజిక అణిచివేతలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆనాటి సామాజిక ఉద్యమాలని ఆయన ప్రత్యేకంగా గమనలోకి తీసుకున్నారని తెలిపారు. ఇంత దూర దృష్టి కలిగిన మహా నాయకుడు శత వర్ధంతిని జరుపుకోవడం మన అందరి బాధ్యతన్నారు. యువత బంగారు భవిష్యత్తుకు దారీ చూపే భారతదేశ అభ్యున్నతికి లెనిన్‌ సిద్ధాంతం మార్గదర్శకం అవుతుందన్నారు. ప్రజలందరూ ఈ సందర్భంగా జరిగే సభలు, సమావేశాలు తదితర కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

➡️