22న విశాఖలో ఐద్వా బహిరంగ సభ – పోస్టర్‌ ఆవిష్కరణ

Feb 17,2024 20:47 #aidwa, #poster avishkarana

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) :ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు విశాఖపట్నంలో ఐద్వా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగుతున్న నేపథ్యంలో 22న మధ్యాహ్నం 2 గంటలకు సరస్వతి పార్కు నుంచి ప్రదర్శన, అనంతరం సెంట్రల్‌ పార్క్‌ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నట్టు సంఘం విశాఖ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.పద్మ, వై.సత్యవతి తెలిపారు. ఆయా కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను శనివారం జగదాంబ దరి సంఘం కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సమస్యలపై ఐద్వా అలుపెరగని పోరాటాలు చేసి స్త్రీల రక్షణ కోసం చట్టాలను సాధించిపెట్టిందన్నారు. ఆస్తి హక్కు చట్టం, అత్యాచార నిరోధక చట్టం, వరకట్న నిషేధ చట్టం, లైంగిక వేధింపుల నిరోధక చట్టం, గృహ హింస నిరోధక చట్టం, నిర్భయ చట్టం వంటి అనేక చట్టాలు మహిళా ఉద్యమాల ఫలితంగానే వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో మహిళలపై అఘాయిత్యాలు, దాడులు, హింస పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా రక్షణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. అసమానతలను అధిగమిస్తేనే మహిళా అభ్యున్నతి సాధ్యమవుతుందని, మహిళా హక్కుల పరిరక్షణే స్త్రీల స్వేచ్ఛ, స్వాతంత్య్రాలకు పునాదని ఐద్వా భావిస్తూ మహిళలను సంఘటితం చేసి పోరాటాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి డాక్టర్‌ జి.ప్రియాంక, నాయకులు ఆర్‌.విమల పాల్గొన్నారు.

➡️