23 నుంచి నందినాటకోత్సవాల తుది పోటీలు

Dec 14,2023 10:38 #Nandinatakotsavalu
  •  సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ విజయ్ కుమార్‌రెడ్డి

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : నాటకరంగం అభివృద్ధికి పేద, మధ్య తరగతి కళాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో నిర్వహిస్తోన్న నంది నాటకోత్సవాల తుది ప్రదర్శన పోటీలను ఈ నెల 23 నుంచి 29వ తేదీ వరకు గుంటూరులో నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్‌, రాష్ట్ర చలన చిత్ర టివి, నాటక రంగ అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ తుమ్మా విజయ్ కుమార్‌ రెడ్డి తెలిపారు. గుంటూరు కలెక్టరేట్‌లో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నంది నాటకోత్సవాల ప్రిలిమనరీ ప్రదర్శనలు సెప్టెంబరు 6 నుంచి 18 వరకు జరిగాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన 115 ఎంట్రీలను ఆయా ప్రాంతాల్లోనే న్యాయనిర్ణేతలు ప్రదర్శనలను తిలకించారని, వాటిల్లో 38 ప్రదర్శనలను తుది పోటీలకు ఎంపిక చేశారని తెలిపారు. పద్య, సాంఘిక నాటకాలు, సాంఘిక నాటికలు, బాలల నాటికలు, కళాశాల లేదా యూనివర్సిటీ నాటిక (ప్లేలెట్స్‌)లు అనే ఐదు విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. ప్రదర్శనలకు సంబంధించి వివిధ విభాగాల్లో, కేటగిరిలో 74 అవార్డులను ప్రదానం చేస్తామన్నారు. ఎన్‌టిఆర్‌ రంగస్థల పురస్కారం, వైఎస్‌ఆర్‌ రంగస్థల పురస్కారం కూడా అందిస్తామని తెలిపారు. కలెక్టర్‌ ఎం వేణుగోపాల్‌ రెడ్డి, సమాచార శాఖ రిటైర్డ్‌ జాయింట్‌ డైరక్టర్‌ జాన్సన్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️