25 నుంచి ప్రజాక్షేత్రంలోకి జగన్‌

Jan 19,2024 08:23 #ap cm jagan, #paryatana

– ప్రాంతీయ సదస్సులతో పూరించనున్న ఎన్నికల శంఖారావం

– ఆలోపు కొలిక్కిరానున్న అభ్యర్థుల ఎంపిక

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రానున్న సాధారణ ఎన్నికలకు అధికార వైసిపి ప్రత్యర్థుల కంటే వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే మూడు విడతలుగా 59 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిన వైసిపి ఈ నెల 25 నాటికి దాదాపు అన్ని పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎవరెవరు బరిలో వుండనున్నారనే అంశాన్ని తేల్చనుంది. అభ్యర్థుల ఎంపిక పూర్తికాగానే రాష్ట్రంలో ఐదు ప్రాంతాల్లో భారీగా ప్రాంతీయ సదస్సులను నిర్వహించనుంది. రీజనల్‌ కో-ఆర్డినేటర్ల ఆధ్వర్యంలో జరిగే ప్రాంతీయ సదస్సుల ద్వారా ఎన్నికల ప్రచారానికి వైసిపి శ్రీకారం చుట్టనుంది. ఈ సమావేశానికి నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, పోటీ చేసేందుకు అవకాశం దక్కని సిట్టింగులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యమైన నాయకులను ప్రతి నియోజకవర్గం నుండి కనీసంగా ఐదు వేల మందిని ఆహ్వానిస్తున్నారు. మొదటి సదస్సును ఈ నెల 25న భీమిలిలో నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నాయకులు హాజరుకానున్నారు. ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి పనులు, మేనిఫెస్టో అమలును వివరిస్తూ.. పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేయడం ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. టిడిపి పొత్తుల అంశంతోపాటు అభ్యర్థుల ఎంపికలో వెనుకబడి వున్నందున వైసిపి అభ్యర్థులు వేగంగా ప్రజల మధ్యకు వెళ్లేందుకు ఈ ప్రాంతీయ సదస్సులు దోహదం చేస్తాయని వైసిపి వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

➡️