జనసేనకు 28 సీట్లు..!

Feb 5,2024 10:06 #28, #Jana Sena, #seats
  • చంద్రబాబుతో పవన్‌రెండు సార్లు భేటీ
  • సీట్ల సర్దుబాటు కొలిక్కి
  • వారంలో ఉమ్మడి మేనిఫెస్టో
  • గోదావరి జిల్లాల్లో భారీగా ఉమ్మడి బహిరంగ సభ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : త్వరలో జరగనున్న ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. ఆదివారం నాడు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పవన్‌కల్యాణ్‌తో రెండు పర్యాయాలు జరిగిన భేటీలో సీట్ల సర్దుబాటుపై దాదాపు 3 గంటలపాటు చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో జనసేనకు 28 సీట్లను ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. ఇటీవల కాలంలో జనసేన పార్టీలోకి చేరికలు పెరగడంతో సీట్లపై ఒత్తిడి ఎక్కువగా వుందని, తమకు అధిక స్థానాలు కేటాయించాల్సిందేనని పవన్‌కల్యాణ్‌ పట్టుబట్టినట్లు సమాచారం. అయితే రాష్ట్రంలో పొత్తు అనేది ప్రత్యర్థి వైసిపి గెలుపునకు బాటలు వేసేలా ఉండకూడదని, గెలిచే సీట్లను మాత్రమే కోరాలని చంద్రబాబు సూచించినట్లు తెలిసింది. అలాగే ఎవరెవరు, ఏయే స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై ఇరుపక్షాల నేతలు చర్చించారని, దీనిపై దాదాపు ఓ క్లారిటీకి వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా, జనసేన, టిడిపి మధ్య ఓటు బదలాయింపు సక్రమంగా జరిగేందుకు క్షేత్రస్థాయి వరకు కలిసే వెళ్లేలా కార్యక్రమాలను రూపొందించేందుకు ప్రణాళికలు తయారుచేసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. పార్టీల పరంగా ఓట్లు పక్కకు వెళ్లకుండా తెలుగుదేశం ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, జనసేన ఎన్ని సీట్లలో అభ్యర్థులను బరిలోకి దింపాలి అనే విషయంపై దాదాపు క్లారిటీ వచ్చేసినట్లేనని తెలియవచ్చింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వారంలోపు ఉమ్మడిగా మొదటి విడతకు సంబంధించిన అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశాలున్నాయని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఇటీవల పొత్తుకు సంబంధించి వచ్చిన విమర్శలు, కామెంట్లపై కూడా చర్చ జరిగిందని సమాచారం. టిడిపి, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి సభలపై కూడా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. వీటికి సంబంధించిన తేదీలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన అనంతరం ఉమ్మడి బహిరంగ సభను గోదావరి జిల్లాల్లో భారీగా జరిపేలా నిర్ణయించినట్లు సమాచారం. ఉండవల్లిలో చంద్రబాబుతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన పవన్‌కల్యాణ్‌ సాయంత్రం మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వెళ్లి వైసిపి ఎంపి బాలశౌరీని పార్టీలో చేర్చుకున్నారు. అనంతరం పవన్‌కల్యాణ్‌ రాత్రి రెండోసారి చంద్రబాబు ఇంటికెళ్లి అక్కడి విందులో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏ అంశంపై అయినా ఉమ్మడిగా వెళ్లేలా నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

➡️