రైతులను ఆదుకునేందుకు సత్వరమే రూ.319.77 కోట్లు

Jun 21,2024 23:43 #upadhi, #Upadi Hami Padhakam

మరో 50 రోజులు అదనంగా ఉపాధి పనులు
కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసిన అజయ్ జైన్‌
పజాశక్తి – అమరావతి బ్యూరో : రబీ కరువు పరిస్థితులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన కేంద్ర బృందం సహాయం అందించే విషయంలో ఉదారంగా స్పందించాలని రాష్ట్ర విపత్తులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్‌ విజ్ఞప్తి చేశారు. విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఆయన శుక్రవారం కేంద్ర కరువు బృందంతో సమావేశమై రాష్ట్రంలో కరువు పరిస్థితులను వివరించారు. 6 జిల్లాల్లోని 63 మండలాలు తీవ్ర కరువు మండలాలు, 24 మధ్యస్థ కరువు మండలాలుగా ప్రకటించినట్లు వివరించారు. రైతులను ఆదుకోవడానికి తక్షణ సహాయంగా సత్వరమే రూ.319.77 కోట్లు అందించాలని కోరారు. ఉపాధి హామీ పథకం కింద అదనంగా మరో 50 పనిదినాలను కల్పించాలని కేంద్ర బృందానికి అజయ్ జైన్‌ విజ్ఞప్తి చేశారు. నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోని కరువు ప్రభావిత మండలాల్లో నాలుగు రోజులుగా పర్యటించిన కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ, ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన సిఇఒ, రైతు సంక్షేమశాఖ జాయింట్‌ సెక్రటరీ రితేష్‌ చౌహాన్‌ నేతృత్వంలోని సభ్యులు పొన్నుస్వామి, సునీల్‌ దుబే, చిన్మరు పుండ్లికరావు గోత్కరే, ఆశిష్‌పాండే, అరవింద్‌కుమార్‌ సోని, మన్నూజి ఉపాధ్యారు ఎస్‌సి కశ్యప్‌, మదన్‌మోహన్‌ మౌర్య, అనురాధ బట్నా.. స్పెషల్‌ సిఎస్‌ అజరుజైన్‌, ఎమ్‌డి రోణంకి కూర్మనాథ్‌తో చర్చించారు.
రితేష్‌ చౌహాన్‌ మాట్లాడుతూ.. కరువు కారణంగా పంట నష్టం జరిగిన రైతులను అన్ని విధాలా ఆదుకునేలా చూస్తామన్నారు. జిల్లాల్లో ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ కరువు పరిస్థితుల వాస్తవికతను తెలియజేస్తున్నాయని, అదే విధంగా క్షేత్రస్థాయిలో రైతులు కరువు వల్ల జరిగిన నష్టాన్ని వివరించారని తెలిపారు. త్వరగా కమిటీ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించి వీలైనంత త్వరగా ఆదుకోవడానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనరు సి హరికిరణ్‌, రిహాబిలిటేషన్‌ అండ్‌ రీ సెటిల్‌మెంట్‌శాఖ కమిషనరు సి శ్రీధర్‌, పశుసంవర్థకశాఖ డైరెక్టరు ఆర్‌ అమరేంద్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️