సెక్యూరిటీల వేలంద్వారా రూ.66,900 కోట్ల రుణం

Mar 31,2024 11:12 #auction, #Crores, #Loans, #securities
  • ఈ ఏడాదికి ముగిసిన వేలం ప్రక్రియ

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా 66,900 కోట్ల రూపాయల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దీనికోసం 36 మంగళవారాలను వినియోగించుకుంది. వాస్తవానికి బడ్జెట్‌లో 63 వేల కోట్లను మాత్రమే రుణంగా తీసుకునేందుకు ప్రతిపాదించగా,3,600 కోట్ల రూపాయలను అదనంగా సమీకరించింది. ప్రతి నెలా మంగళవారాల్లో రిజర్వ్‌బ్యాంకు నిర్వహించే వేలంలో రుణాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎంత రుణాలు కావాలన్నది కూడా ముందుగానే రిజర్వ్‌బ్యాంకుకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే మొత్తం 36 సార్లు రుణ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. 2023 ఏప్రిల్‌లో కేవలం ఒక రోజు మాత్రమే రుణానికి వెళ్లిన ఆర్థికశాఖ మూడు వేల కోట్లను సమీకరించింది. అది కూడా ఒకే రోజు మూడు భాగాలుగా ఈ రుణాన్ని తీసుకోవడం గమనార్హం. ఆ తరువాత క్రమం తప్పకుండా మే నెల్లో నాలుగు సార్లు, జూన్‌లో ఐదు సార్లు, జూలైలో నాలుగుసార్లు, ఆగస్టులో మూడు పర్యాయాలు రుణాలకు వెళ్లారు. అలాగే సెప్టెంబర్‌లో, అక్టోబర్‌లో కూడా నాలుగేసి పర్యాయాలు రుణ సమీకరణ చేశారు. ఇక నవంబర్‌, డిసెంబర్‌, ఫిబ్రవరిలో మూడేసి పర్యాయాలు రుణానికి వెళ్లిన రాష్ట్రం ఈ ఏడాది జనవరిలో రెండు సార్లు రుణాన్ని సేకరించింది. కాగా ఆర్థిక సంవత్సరం చివరి నెల అయిన మార్చిలో మాత్రం కేవలం ఒక్కసారే రుణానికి వెళ్లిన ఆర్థికశాఖ ఆ ఒక్క రోజే ఏకరగా నాలుగు వేల కోట్లు సమీకరించడం విశేషం.

➡️