రాష్ట్రంలో 81.86 శాతం పోలింగ్‌

  • ఇప్పటివరకు ఇదే అత్యధికం
  • సిఇఓ ముఖేష్‌ కుమార్‌ మీనా

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో 81.86 శాతం పోలింగ్‌ జరిగినట్లు సిఇఓ ముఖేష్‌ కుమార్‌ మీనా తెలిపారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలో ఇప్పటి వరకు జరిగిన నాలుగు దశల పోలింగ్‌ ప్రక్రియలో ఇదే అత్యధికమని తెలిపారు.
ఇవిఎమ్‌ల ద్వారా 80.66శాతం ఓట్లు నమోదు కాగా, ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌, 85 ఏళ్లుదాటిన వృద్దులు, వికలాంగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా 1.2శాతం పోలింగ్‌ నమోదైందన్నారు. రాష్ట్రంలో మొత్తం 4,13,33,702 మంది ఓటర్లు ఉన్నారని, వారిలో 3,33,40,560 మంది ఓటర్లు పార్లమెంటరీ ఎన్నికల్లోనూ 3,33,40,333మంది అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ ఓటుహక్కును వినిమోగించుకున్నారని తెలిపారు. ఇవిఎమ్‌ల ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో పురుషులు 1,64,30,359మంది, మహిళలు 1,69,08,684 మంది, ఇతరులు 1517 మంది ఉన్నట్లు చెప్పారు. పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఒంగోలులో అత్యధికంగా 87.06శాతం పోలింగ్‌ నమోదు కాగా, అత్యల్పంగా విశాఖపట్నంలో 71.11 శాతం పోలింగ్‌ నమోదయ్యాయన్నారు. శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి అత్యధికంగా దర్శి నియోజకవర్గంలో 90.01శాతం పోలింగ్‌ నమోదు కాగా, తిరుపతిలో అత్యల్పంగా 63.32 శాతం పో లింగ్‌ నమోదైనట్లు సిఇఓ తెలిపారు. గత ఎన్నికల్లో తిరుపతిలో 65.90 శాతం పోలింగ్‌ నమోదు కాగా, ఈ దఫా 63.32శాతానికి తగ్గడానికి ఆ నియోజకవర్గంలో బోగస్‌ ఓట్లను నియంత్రించడమే ప్రధాన కారణమని తెలిపారు. విశాఖలో గత ఎనికల్లో 67శాతం పోలింగ్‌ నమోదు కాగా, ఈ సారి ప్రత్యేకించి విశాఖ పట్టణ ప్రాంతంలో 71.11శాతం పోలింగ్‌ నమోదవ్వడం మంచి పరిణామమని సిఇఓ పేర్కొన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద మూడెంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 715 పోలీస్‌ పికెట్స్‌ ఏర్పాటు చేశామన్నారు.

పెరిగిన పోస్టల్‌ బ్యాలెట్స్‌
2019 ఎన్నికల్లో 2.62లక్షల పోస్టల్‌ బ్యాలెట్స్‌ను ఉద్యోగులు వినియోగించుకోగా, ఈ సారి 4.97లక్షల పోస్టల్‌ బ్యాలెట్స్‌ను వినియోగించుకున్నారని సిఇఓ తెలిపారు. గత ఎన్నికల్లో 56 వేల పోస్టల్‌ బ్యాలెట్లను తిరస్కరించడం జరిగిందని, ఈ దఫా ఉద్యోగులు ఎంతో జాగ్రత్తగా ఓటు ్ల వేయడంతో అటువంటి పరిస్థితి తలెత్తలేదన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు 4.44లక్షల పోస్టల్‌ బ్యాలెట్స్‌ను , 85ఏళ్లకు పైబడిన వారిలో వృద్దులు 13,700మంది, వికలాంగులు 12,700మంది, అత్యవసర సర్వీస్‌ ఓటర్లు 27,100 మంది పోస్టల్‌ బ్యాలెట్స్‌ను వినియోగించుకున్నారని సిఇఓ వెల్లడించారు. గత ఎన్నికలతో పోలిస్తే 2.09 శాతం పోలింగ్‌ పెరిగిందన్నారు.

ఆ పోలీసులపై త్వరలో చర్యలు 
పోలింగ్‌ అనంతర ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో కొందరు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించినట్టు గుర్తించామని సిఇఓ ముఖేష్‌కుమార్‌ మీనా తెలిపారు. బుధవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడిన పోలింగ్‌ అనంతర హింసపై విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. అక్కడక్కడ కొందరు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించినట్లు తమ దృష్టికి వచ్చిందని, అలా వ్యవహరించిన వారిని ఇప్పటికే గుర్తించామని ఒక ప్రశ్నకు ఆయన జవాబుగా చెప్పారు. వీరిని ఉపేక్షించేదిలేదని, త్వరలోనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారినికూడా గుర్తించే పనిలో ఉన్నట్లు చెప్పారు. తాడిపత్రి,మాచర్ల, చంద్రగిరి, నరసరావుపేటలో ఘటనలకు కారణమైన వారినందరినీ ఇప్పటికే గుర్తించినట్లు చెప్పారు. చంద్రగిరి ఘటనకు సంబంధించి ఇప్పటికే 30మందిని అరెస్ట్‌ చేశామని, మిగిలిన వారిని మరో 24 గంటల్లోగా అరెస్ట్‌ చేస్తామని చెప్పారు. ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో సీనియర్‌ అధికారులకు అదపు బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. ఈ ప్రాంతాల్లో అదనపు సాయుధ బలగాలతో పాటు 144 సెక్షన్‌ విధించడం, స్ధానికంగా రాక పోకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయన్నారు. హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉఫేక్షించేది లేదన్నారు. హింసాత్మక ఘటలనకు కారణమైన అభ్యర్థులను గృహ నిర్భందం చేశామని, వీరిపై కేసులు పెడతామని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సిఇఓ తెలిపారు.

➡️