లెక్క తేలని రూ.91,253 కోట్లు

Jan 30,2024 10:40 #Cog, #JanaSena, #Nadendla Manohar
  • ఆర్ధిక అవకతవకలపై కాగ్‌ విచారణ చేపట్టాలి
  • నాదెండ్ల మనోహర్‌ డిమాండ్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పుల్లో రూ.91,253.29 కోట్లకు లెక్కలు తేలడం లేదని, తీసుకొచ్చిన అప్పును ఎందుకు, ఎప్పుడు ఖర్చు పెట్టారో కూడా తెలియని అయోమయ పరిస్థితి నెలకొందని జనసేన పిఎసి ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. లెక్కలు తేలని అప్పులపై కాగ్‌ జోక్యం చేసుకుని విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. విజయవాడ బందరు రోడ్డులోని ఓ ప్రైవేటు హోటల్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన పక్కన ఉన్న మరో కుర్చీలో ఆయన సిఎం జగన్‌ ఫ్లెక్సీని పెట్టారు. మీడియా సమావేశాలను జగన్‌ నిర్వహించడం లేదని, విలేకరుల ప్రశ్నలను తీసుకోవడం లేదని, అందుకు నిరసనగా మీడియా సమావేశంలో జగన్‌ ఫ్లెక్సీని పెట్టినట్లు ఆయన వివరించారు. ‘మీడియా సమావేశం నిర్వహించలేని జగన్‌ దేనికి సిద్ధం’ అని ఆయన ప్రశ్నించారు. ఈ మొత్తానికి లెక్క చెప్పేందుకు రివర్స్‌ బారోయింగ్‌ అనే పదాన్ని జగన్‌ ప్రభుత్వం సృష్టిస్తోందన్నారు. అప్పుల రూపేణా తెచ్చిన నగదు ఎటు పోయిందో అర్థంకాక, బడ్జెట్‌లో ఎలా లెక్కలు చూపాలో అర్థం కాక అధికారులలో ఆందోళన మొదలైందన్నారు. వైసిపి చేతగాని పాలనలో ఏషియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్టిమెంట్‌ బ్యాంక్‌, బ్రిక్స్‌ బ్యాంక్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాయన్నారు. రాష్ట్ర పరువును అంతర్జాతీయ స్దాయిలో జగన్‌ ప్రభుత్వం తీసిందన్నారు. ప్రాంతీయ సదస్సులంటే ఆయా ప్రాంతీయ సంస్కృతులను ప్రతిబింబించేలా కళాకారుల ప్రదర్శనలు చేస్తారని, వైసిపి మాత్రం భీమిలిలో నిర్వహించిన సభలో విపక్ష నాయకుల బొమ్మలను ఏర్పాటు చేసి వాటికి పంచ్‌ బ్యాగులను ఏర్పాటు చేశారన్నారు. కార్యకర్తలతో వాటిని కొట్టిస్తూ విద్వేషం నింపే ప్రయత్నం చేశారన్నారు. ఇలాంటి విద్వేషపు పనులను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.

➡️