భారీ జనసందోహం మధ్య బస్సు యాత్ర 

  • సిఎం జగన్‌తో పింఛను లబ్ధిదారుల ముఖాముఖి

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి, దర్శి(ప్రకాశం జిల్లా) : తమకు వలంటీర్‌ వ్యవస్థ కావాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి పింఛను లబ్ధిదారులు కోరారు. ‘మేమంతా సిద్ధం’లో భాగంగా ముఖ్యమంత్రి 11వ రోజు సోమవారం ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో పర్యటించారు. రోడ్‌ షో నిర్వహించారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం వెంకటాచలంపల్లిలో మూడు వేల మంది నవరత్నాల లబ్ధిదారులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సింహారావు అనే పింఛనుదారు మాట్లాడుతూ 2019కి ముందు వికలాంగుల నుంచి కూడా జన్మభూమి కమిటీ లంచాలు తీసుకునేదని, పింఛన్లు కావాలంటే డబ్బులు చెల్లించాల్సి వచ్చేదని, వైసిపి ప్రభుత్వం వచ్చాక వలంటీర్లు ఇంటికే వచ్చి పింఛను ఇస్తున్నందున మాలాంటి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉందని అన్నారు. ఎన్నికల కోడ్‌ పేరుతో ఈ నెల వలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరంగా పెట్టడంతో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. పింఛను తీసుకెళ్లేందుకు వెళ్తూ మండుటెండలో 70 ఏళ్ల వద్ధురాలు కుప్పకూలిపోవడం తాను కళ్లారా చూశారని వివరించారు. వితంతు పింఛనుదారు ప్రభావతి మాట్లాడుతూ మోకాళ్ల నొప్పి వల్ల తాను నడవలేనని, గతంలో ఇంటికే పింఛను అందేదని,ఈ నెల ఇచ్చే పింఛను కోసం నన్ను మూడు చోట్లకు తిప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మాకు జగన్‌ కావాలి, వలంటీర్‌ వ్యవస్థ కావాలి’ అని అన్నారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ తాను రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత వలంటీర్ల వ్యవస్థను కొనసాగించే ఫైల్‌పైనే మొదటి సంతకం చేస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం కురిచేడు మండలంలో యాత్ర కొనసాగింది. జగన్‌ని చూడటానికి జనాలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. బస్‌పై భాగాన జగన్‌ ఎక్కి ప్రజలకు అభివాదం చేశారు. కురిచేడులోని ఎన్‌ఎస్‌పి కాలనీ వద్ద ప్రజలు తమ సమస్యలను జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆటో డ్రైవర్‌ చిప్పగిరి పాపయ్య మాట్లాడుతూ తన కూతురు చందనకి రెండు కళ్లూ కనిపించవన్నారు. ఆ పాప చదువు కోసం తగు ఏర్పాట్లు చేయాలని, దుర్గాభవాని అనే అమ్మాయి మూర్ఛ వ్యాధితో బాధపడుతుందోని, మెరుగైన చికిత్సకు అవసరమైన సహాయం చేయాలని ముఖ్యమంత్రికి అర్జీలు అందాయి. వాటిపై తగు చర్యలు వెంటనే తీసుకుంటానని జగన్‌ హామీ ఇచ్చారు.
ప్రకాశం జిల్లా కురిచేడు నుంచి పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం చింతలచెరువుకు వచ్చిన బస్సు యాత్ర అయినవోలు మీదుగా గుంటూరు-కర్నూలు జాతీయ రహదారి నుండి చీకటి ఈగలపాలెం గ్రామం మీదగా ర్యాలీగా సాయంత్రం ఆరు గంటలకు పల్నాడు జిల్లా వినుకొండకు చేరుకున్నారు. బస్సుపై నుంచి సిఎం జగన్‌ ప్రజలకు అభివాదం చేశారు. అక్కడి నుంచి వినుకొండ వరకు జరిగిన బస్సు యాత్రకు భారీగా ప్రజలు తరలి వచ్చి ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. అభిమానులు సిఎం కాన్వారుపై పూలు చల్లారు. యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సాయంత్రం ఐదు గంటలనుంచి రాత్రి ఏడు గంటల వరకు యాత్ర కొనసాగింది.

➡️