వాడవాడలా సుందరయ్య వర్థంతిని జరపాలి : సిపిఎం రాష్ట్ర కమిటీ

May 15,2024 18:15 #cpm, #prakatana

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్థంతిని రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా జరపాలని సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు బుధవారం ప్రకటన విడుదల చేశారు. వర్థంతి సందర్భంగా సభలు, సదస్సులు, ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరపాలని, రాష్ట్రాభివృద్ధిపై సుందరయ్య సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించిందని తెలిపారు. ఆయన రాసిన విశాలాంధ్రలో ప్రజారాజ్యం పుస్తకంలో ఏడు దశాబ్దాల కిందటనే రాష్ట్రాభివృద్ధి గురించి సరైన విశ్లేషణ చేశారని తెలిపారు. ఆ మార్గం నేటికీ అనుసరణీయమని వివరించారు. 1917 మే1న జన్మించిన సుందరయ్య తన యావత్‌ జీవితాన్ని పేదలకు, కష్టజీవులకు అంకితం చేశారని తెలిపారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సారధుల్లో ఒకరని అన్నారు. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించడంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు. పిన్న వయసులోనే కులవివక్షకు వ్యతిరేకంగా నిలబడి పోరాడారని, ఉక్కు క్రమశిక్షణ త్యాగనిరతి, అధ్యయనం, ఆచరణ, నిర్మాణ దక్షత ఆయన సొంతమని అన్నారు. అటువంటి మహనీయుని ఆశయాలు ముందుకు తీసుకుపోవడం మనందరి బాధ్యతని పేర్కొన్నారు. మతోన్మాద రాజకీయాలు పెట్రేగిపోతున్న నేటి రాజకీయ పరిస్థితుల్లో సుందరయ్య స్ఫూర్తిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని తెలిపారు.

➡️