దేశాన్ని మత రాజ్యంగా మార్చే కుట్ర

Jan 27,2024 10:28 #DSMM, #leaders, #speech
  • రాజ్యాంగ హక్కుల రక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి
  • వివక్ష చూపే ప్రజా ప్రతినిధులపై జగన్‌ చర్యలు తీసుకోవాలి : డిఎస్‌ఎంఎం జాతీయ నాయకులు వి.శ్రీనివాసరావు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రిపబ్లిక్‌ డే ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రజాస్వామ్య విలువలు గురించి కాకుండా ఆధ్యాత్మిక, అయోధ్య రామాలయం గురించి మాట్లాడటమంటేనే దేశాన్ని ఒక మత రాజ్యంగా మార్చేందుకు ప్రయత్నం మొదలైనట్లు స్పష్టమవుతోందని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని దళిత శోషణ్‌ ముక్తి మంచ్‌ (డిఎస్‌ఎంఎం) జాతీయ నాయకులు వి శ్రీనివాసరావు పేర్కొన్నారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా శుక్రవారం విజయవాడలోని బందరు రోడ్డులో ఉన్న డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం ఎదుట కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భారత రాజ్యాంగ పీఠిక ప్రమాణాన్ని వి శ్రీనివాసరావు చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మనువాద ధర్మం పేరుతో దళితులు, బిసిలను కులాల వారీ విభజించి మూడు వేల ఏళ్ల క్రితం నాటి అనాగరిక ఆదిమ సమాజాన్ని దేశమ్మీద రుద్దేందుకు ప్రధాని మోడీ ప్రయత్నం చేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు. వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు దీన్ని అడ్డుకోవడానికి ముందుకు వస్తారా? లేక సాగనిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. మోడీ ఒక వైపు అణగారిన తరగతులను అణగ తొక్కుతూ ఉంటే ఆ పార్టీకే మద్దతిస్తూ, మరొక వైపు దళితులు, మైనార్టీలకు రక్షణ కల్పిస్తున్నామని చెప్పడంలో అర్థం లేదన్నారు. రిపబ్లిక్‌ డే సందర్భంగానైనా అంటరానితనాన్ని పాటిస్తున్న ప్రజా ప్రతినిధులపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకుంటానని స్పష్టమైన ప్రకటన చేయాలని శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు, డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగ అమలుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు వై వెంకటేశ్వరరావు, గిరిజన సంఘం నాయకులు మంతెన సీతారామ్‌ మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మోడీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారని వారు విమర్శించారు. రాజ్యాంగ విలువలను కాపాడుకునేందుకు మరో స్వాతంత్య్ర పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ నాయకులు జి నటరాజ్‌, క్రాంతి, ముస్లిం మైనార్టీ నాయకులు బేగ్‌, దళిత సంఘాల నాయకులు సూర్యారావు, శ్రీనివాస్‌, అరుణ, అశోక్‌బాబు, శ్యామ్‌, రారాజు, ప్రసన్న, రాఘవేంద్ర, సుందరయ్య పాల్గొన్నారు.

➡️