పోలీసు స్టేషన్‌లోనే టిడిపి కార్యకర్తపై వైసిపి నేత దాడి

May 12,2024 00:19 ##Karlapalem, #tdp vs ycp

– బాధితుడి బంధువుల ఆందోళన
– ఎస్‌ఐ సస్పెన్షన్‌
ప్రజాశక్తి-కర్లపాలెం (బాపట్ల జిల్లా) :’మా పార్టీ నుండి టిడిపిలో చేరతావా’ అంటూ బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో ఓ వ్యక్తిపై వైసిపి నేత, సినీ నిర్మాత కోన వెంకట్‌ పోలీస్‌ స్టేషన్‌లోనే దాడి చేసిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. బాధితుడి సోదరుడు కత్తి దయాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గణపవరం పంచాయతీ పరిధిలోని లంకమాలపల్లికి చెందిన కత్తి రాజేష్‌ ఇటీవల టిడిపిలో చేరారు. ఇది సహించని వైసిపి నేతలు ఆయనపై కక్ష కట్టారు. వైసిపి నేతల ప్రోద్బలంతో ఎస్‌ఐ జనార్ధన్‌.. రాజేష్‌ను స్టేషన్‌కు తీసుకొచ్చారు. అక్కడికి చేరుకున్న కోన వెంకట్‌ ‘నిన్నటి వరకు మా పార్టీలో ఉండి.. ఇప్పుడు టిడిపిలో చేరతావా.?’ అంటూ పోలీస్‌స్టేషన్‌లో పోలీసుల ముందే రాజేష్‌పై దాడి చేశారు. విషయం తెలుసుకున్న టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి నరేంద్రవర్మ, మాజీ ఎమ్మెల్సీ, బిజెపి నాయకులు అన్న సతీష్‌ ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యే చీరల గోవర్ధన్‌రెడ్డి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని బాధితుడికి తక్షణమే న్యాయం చేయాలని కోరారు. రాజేష్‌పై దాడి చేసిన కోన వెంకట్‌పై కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. బాధితుడి బంధువులు మాట్లాడుతూ న్యాయం జరిగే వరకు స్టేషన్‌ నుండి బయటికి వెళ్లబోమని అక్కడే భీష్మించారు. డిఎస్‌పి మురళీకృష్ణ, సిఐ హజరత్‌ బాబు స్టేషన్‌కు చేరుకొని నాయకులతో మాట్లాడారు. ఎస్‌ఐ జనార్ధన్‌ వైసిపి కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని, ఏ కారణంతో రాజేష్‌ను స్టేషన్‌కు తీసుకువచ్చారని డిఎస్‌పిని నిలదీశారు. బాధితునికి న్యాయం చేస్తానని డిఎస్‌పి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఎస్‌ఐని అధికారులు సస్పెన్షన్‌ చేశారు.

➡️