చెరువులో పడి యువకుడు మృతి

Dec 16,2023 18:08
A young man died after falling into a pond

నాగులపాలెం ఎస్సీ కాలనీలో విషాదం…

ప్రజాశక్తి-పర్చూరు : చెరువులో పడి యువకుడు మృతి చెందిన సంఘటన బాపట్ల జిల్లా పర్చూరు మండలంలోని నాగులపాలెంలో జరిగింది. నెహ్రూ కాలనీకి చెందిన యువకుడు బేతా సుదర్శన్ రావు (18) మూడు రోజుల క్రితం ప్రార్ధనకు వెళుతున్నానని చెప్పి ఇంట్లో నుండి వెళ్లిపోయాడు. ఆరోజు నుండి తన కుమారుడు కనబడటం లేదని తల్లి కొటేశ్వరమ్మ ఈనెల 14వ తేదీన స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు. ఈక్రమంలో శనివారం ఉదయం చెరువు వద్దకు వెళ్లిన కొందరు స్థానికులకు సుదర్శన్ రావు శవం నీళ్ళపై తేలుతూ కనబడింది. దీంతో వారు మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చెరువు వద్దకు చేరుకున్న తల్లి కొటేశ్వరమ్మ, ఆమె పెద్ద కుమారుడు మృతదేహాన్ని చూసి భోరున విలపించారు. సమాచారం అందుకున్న ఎస్సై రవి శంకర్ రెడ్డి హుటాహుటిన తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి మృతదేహాన్ని పంచాయతీ సిబ్బంది సహకారంతో బయటికి తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పర్చూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. చెరువుని లోతుగా త్రవ్వటం వలనే ఈ ఘోరం జరిగిందని పలువురు కాలనీ వాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

➡️