వైఎస్‌ఆర్‌ కలెక్టరేట్‌లో ఎసిబి దాడులు

Mar 11,2024 15:14 #Kadapa
  • రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సి సెక్షన్‌ సూపరింటెండెంట్‌

ప్రజాశక్తి-కడప : వైఎస్‌ఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. కలెక్టరేట్‌లోని సి-సెక్షన్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ప్రమీల రూ.50 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా అధికారులకు పట్టుబడ్డారు. ఎసిబి డిఎస్‌పి గిరిధర్‌ ఇందుకు సంబంధించిన తెలిపిన వివరాల ప్రకారం.. చుక్కల భూములకు సంబంధించిన ఫైల్‌ క్లోజ్‌ చేసి పట్టా భూమిగా మార్చే విషయమై జిల్లాలోని వీరపునాయినిపల్లి మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన వీరపు శేఖర్‌ అనే రైతు వద్ద నుంచి సర్వే నంబర్‌ 451, విస్తీర్ణం 6.64 ఎకరాలకు సంబంధించి రూ.1.50 లక్షలు లంచంగా ఇవ్వాలని ప్రమీల డిమాండ్‌ చేశారు. తాను అంత డబ్బులు ఒకేసారి ఇవ్వలేనని కొంచెం కొంచెం చెల్లిస్తానని శేఖర్‌ చెప్పారు. అనంతరం ఎసిబిని రైతు ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆ రైతు నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ప్రమీలను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి కర్నూలులోని ఎసిబి కోర్టులో ఆమెను హాజరు పరచనున్నట్లు ఎసిబి డిఎస్‌పి తెలిపారు. దాడుల్లో సిఐలు ఎల్లమ రాజు, శ్రీనివాసరెడ్డి, అలీ, ఎస్‌ఐ నరేష్‌ పాల్గొన్నారు.

➡️