ఆరోగ్య మిత్రల సమస్యలు పరిష్కరించాలి: సిఎంకు వి.శ్రీనివాసరావు లేఖ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అత్యవసర సేవలకు సాయమందిస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉన్న ఆరోగ్య మిత్రల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి శనివారం ఆయన లేఖ రాశారు. ఆరోగ్య మిత్రలు 15 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారని, పథకం గుర్తింపు పొందేలా కృషిచేయడంలో వీరిది ప్రధాన భూమికని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీతో పాటు ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఇహెచ్‌ఎస్‌), వర్కింగ్‌ జర్నలిస్టు ఆరోగ్య పథకం (డబ్ల్యుజెహెచ్‌ఎస్‌), ఆరోగ్య రక్ష వంటి పథకాల్లో విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇంతలా కష్టపడుతున్నా ఇప్పటికీ సరైన జీతంలేక, ఉద్యోగ భద్రత లేక, క్యాడర్‌ లేక సతమతమవుతున్నారని వివరించారు. ప్రభుత్వం తాజాగా బదిలీలు చేపట్టిందని, నామమాత్రపు జీతాలతో సతమతమవుతున్న ఉద్యోగులు బదిలీలతో రవాణా ఖర్చులు పెరిగి వచ్చే ఆదాయంలో కోత పడి కుటుంబ జీవనం కష్టంగా మారిందని తెలిపారు. వీరి సమస్యలను సంబంధిత యూనియన్‌ ఎప్పటికప్పుడు పైఅధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఎలాంటి ప్రయోజనమూ లేదని వివరించారు. వెంటనే వారి సమస్యలపై దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. వారికి కేటగిరీ 1 క్యాడర్‌ ఇవ్వాలని, కోవిడ్‌ కాలంలో ప్రాణాలు కోల్పోయిన ఆరోగ్యమిత్ర కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షలు పరిహారంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని. మట్టి ఖర్చుల నిమిత్తం రూ.10 వేలు ఇవ్వాలని సిఎంకు విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యమిత్రల కుటుంబాలకు ఇహెచ్‌ఎస్‌ కార్డులు మంజూరు చేయాలని, అన్ని డిపార్టమెంట్లు మాదిరి ఆరోగ్య మిత్రలకూ ప్రమోషన్లు అప్పగించాలని, ఉద్యోగ భద్రత ఇవ్వడంతోపాటు హెచ్‌ఆర్‌ పాలసీని అమలు చేయాలని కోరారు. సీనియర్‌ అసిస్టెంట్‌ క్యాడర్‌ కల్పించి మెడికల్‌ డిపార్టుమెంట్‌లో ఉన్నట్లు 30 రోజులు మెడికల్‌ లీవులు ఇవ్వాలని కోరారు. వారి సమస్యలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

➡️