ఆదివాసీ చట్టాలను ఉల్లంఘించారు

  • అదానీ హైడ్రో పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులకిచ్చిన అనుమతులు వెనక్కి తీసుకోండి
  • ముఖ్యమంత్రికి రిటైర్డ్‌ ఐఎఎస్‌ ఇఎఎస్‌ శర్మ లేఖ

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) : షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో అమలులో ఉన్న పీసా, అటవీ హక్కుల చట్టాలు, ఎల్‌టిఆర్‌ చట్టాలను గత వైసిపి ప్రభుత్వం విచక్షణ లేకుండా ఉల్లంఘించిందని మాజీ విశ్రాంత ఐఎఎస్‌ అధికారి ఇఎఎస్‌.శర్మ విమర్శించారు. ఆదివాసీ ప్రజల ఉద్దేశాలను గౌరవించకుండా, ఎటువంటి కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ లేకుండా అదానీ కంపెనీకి రాష్ట్ర షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో హైడ్రో పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులు చేపట్టడం అక్కడి ఆదివాసీ సమాజానికి ఆశ్చర్యం, బాధ కలిగించిందని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు మంగళవారం ఆయన లేఖ ద్వారా తెలిపారు. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం ఎర్రవరం ప్రాంతంలోని గనుగుల గ్రామం వద్ద ధారకొండ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టు చేపట్టేందుకు అదానీ కంపెనీకి క్షణాల్లో అనుమతులు ఇవ్వడాన్ని ఆదివాసీ ప్రజలు ఖండించారని వివరించారు. ఆ నిర్ణయం పీసా చట్టానికి విరుద్ధమని పేర్కొన్నారు. చట్టవిరుద్ధమైన, ఆదివాసీలకు హాని కలిగించే ప్రాజెక్టుల అనుమతులను కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని అక్కడి ఆదివాసీలు ఆశిస్తున్నారని తెలిపారు. పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులను వెనక్కి తీసుకోవాలని, రాజ్యాంగం ఐదవ షెడ్యూల్‌ కింద, ఆదివాసీ ప్రతినిధులతో కూడిన టిఎసిని నియమించి, వారి సలహాలను తీసుకుని, చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు. షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో పీసా చట్టం నూరు శాతం అమలు చేసి, ఆదివాసీ గ్రామ సభలకు అధికారం కలిగించాలని విజ్ఞప్తి చేశారు.

➡️