అందుబాటులోకి 2వేల కోర్సులు

Feb 16,2024 21:50 #ap cm jagan, #speech

-‘ఎడెక్స్‌’ ఒప్పందంతో విద్యార్థులకు కొత్త భవిష్యత్తు

-సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ప్రపంచంలోని వివిధ ప్రతిష్టాత్మక యూనివర్శిటీల్లో అందించే కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ‘ఎడెక్స్‌’ సంస్థతో ఒప్పందం చేసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తెలిపారు. ఆ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం శక్రవారం ఒప్పందం చేసుకుంది. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిఎం మాట్లాడుతూ ఎడెక్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా ప్రపంచంలోనే వివిధ యూనివర్సిటీల్లో అందుబాటులో ఉన్న 2వేలకు పైగా వివిధ కోర్సులు రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, డేటా సైన్సెస్‌, రియల్‌ ఎస్టేట్‌ మేనేజ్‌మెంట్‌ వంటి అంశాలు పాశ్చాత్య దేశాల్లో డిగ్రీలోనే ఉంటాయని, మన వద్ద ఉండవన్నారు. వీటిని నేర్పించే సిబ్బంది, ఇటువంటి పరిజ్ఞానం మన వద్ద లేదని చెప్పారు. ఫలితంగా అందరికీ నాణ్యమైన విద్య అందుబాటులోకి రావడం కష్టమవుతుందని అన్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా విద్యార్థులకు అన్ని యూనివర్సిటీలలోని కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో ఈ ఒప్పందం చేసుకుంటున్నట్లు తెలిపారు. దీనివల్ల పెద్ద యూనివర్సిటీలలో సీట్లు రాకపోయినా ఆ కోర్సులు మన యూనివర్సిటీల్లోనే అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు. ఇది గొప్ప మార్పు కు దారితీస్తుందని చెప్పారు. టెక్నాలజీని పిల్లల వద్దకు తీసుకువస్తేనే నాణ్యమైన విద్యను అందించగలుగుతామని తెలిపారు. ప్రతి వైస్‌ ఛాన్సలర్‌ దీనిపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఇప్పుడు విద్యార్థులు ప్రపంచంతో పోటీపడాల్సివస్తోందని, దీనిని దృష్టిలో ఉంచుకుని విద్యారంగంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు.. విద్యాహక్కు చట్టం అనేది పాత నినాదం అని, నాణ్యమైన విద్య హక్కు ఇప్పుడు కొత్త నినాదమని చెప్పారు. ఈ హక్కును పిల్లలకు ఇవ్వడంలో వెనుకబడితే ప్రపంచం మనల్ని దాటుకుని వెళ్లిపోతుందని చెప్పారు. 2035 నాటికి రాష్ట్రంలో విద్యార్థులు ఐబీలో పరీక్షలు రాసే స్థాయికి ఎదుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌ రెడ్డి, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్‌, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కె హేమచంద్రారెడ్డి,కళాశాల విద్య కమిషనర్‌ పోలా భాస్కర్‌, పాఠశాల విద్యాశాఖ మౌలిక వసతుల కల్పన కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌, ఎడెక్స్‌ వ్యవస్థాపకులు అనంత అగర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️