మద్యానికి బానిసై భార్యను హత్య చేసిన భర్త

Mar 22,2024 16:44 #Manyam District, #Murder
  • పరారీలో ఉన్న నిందితుడు ముసలి నాయుడు
  • క్లూస్ టీంతో దర్యాప్తు జరిపిస్తున్న పోలీసులు

ప్రజాశక్తి-జియ్యమ్మవలస : మద్యం మత్తు మనిషిని పశువుగా మారుస్తుందనడానికి నిదర్శనమే ఈ హత్య. మనిషి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి తన భార్యనే అతి కిరాతకంగా కొడవళితో కడుపు కోసి చంపిన వైనం పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మ వలస మండలం సింగనాపురం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని గంట ముసలి నాయుడు తన భార్య అయిన గంట అప్పలనరసమ్మను తరచూ కొట్టడం, వేధించడంతో పది రోజుల పాటు అప్పల నరసమ్మ ఇటిక గ్రామంలో తన చిన్న కూతురు వద్దనే ఉండి బుధవారం సింగనాపురం తన ఇంటికి వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గురువారం రాత్రి సుమారు 12 గంటల సమయంలో మద్యం మత్తులో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి కొడవలితో అతి కిరాతకంగా కడుపును కోసి చంపేసి పరారైయ్యాడు. విషయం తెలుసుకున్న స్థానిక సచివాలయం పోలీస్ పి.మోహిని చిన మేరంగి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్సై ఇ.చిన్నమనాయుడు, జియ్యమ్మ వలస ఎస్సై. పి.అనిష్, సీఐ మంగరాజు, పాలకొండ డి.ఎస్.పి జి.వి కృష్ణారావు తదితరులు క్లూస్ టీం ఎస్సై ఎస్.తేజ స్వరూప్ సిబ్బంది తో దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా గ్రామంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి అని ఇరుగుపొరుగువారు భయభ్రాంతులకు గురవుతున్నారు. మృతి చెందిన అప్పల నరసమ్మకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు.

➡️