వెల్లువెత్తుతున్న సంఘీభావం 

Jan 19,2024 10:07 #Anganwadi strike
  • రెండో రోజూ కొనసాగిన నిరవధిక దీక్షలు
  • నేడు అంబేద్కర్‌ విగ్రహాల ఎదుట సత్యాగ్రహం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీ సంఘాల నేతలు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలకు సంఘీభావం వెల్లువెత్తుతోంది. దీక్షలు రెండవరోజైన గురువారమూ కొనసాగాయి. విజయవాడ ధర్నాచౌక్‌లోని దీక్షా శిబిరానికి పెద్ద సంఖ్యలో వివిధ ప్రజా,కార్మిక సంఘాలకు చెందిన నేతలు, కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజానీకం కూడా తరలివస్తున్నారు. నిరవధిక నిరాహార దీక్షల్లో ఉన్న నేతలకు తమ మద్దతు తెలియచేస్తున్నారు. దీంతో ధర్నా చౌక్‌లో ఉదయం నుండి సాయంత్రం వరకు సందడి వాతావరణం నెలకొంటోంది.సమ్మె ప్రారంభమై 38 రోజులు పూర్తయినా ప్రభుత్వం స్పందించకపోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్‌ విగ్రహాల ఎదుట సత్యాగ్రహ దీక్షలు చేపట్టాలని అంగన్‌వాడీ సంఘాలు పిలుపునిచ్చాయి. సామాజిక న్యాయం పేరిట విజయవాడలో భారీ అంబేద్కర్‌ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ సంఘాలు తెలిపాయి. ఈ మేరకు ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బారావమ్మ, ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోషియేషన్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జె లలితమ్మ, ఎపి ప్రగతిశీల అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రధానకార్యదర్శి విఆర్‌ జ్యోతిలు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు.రాష్ట్రంలో లక్ష మంది అంగన్‌వాడీలు సమ్మెలో వుంటే ఏ మాత్రం స్పందించని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు మహిళా సాధికారతను ఎలా సాధిస్తారో చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. విజయవాడ ధర్నాచౌక్‌లో గురువారం మద్దతు తెలియచేసిన వారిలో ఎపి వ్యవసాయకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు, ఎపి పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్‌ సిహెచ్‌ బాబురావు, యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు, ఐద్వా రాష్ట్ర నాయకులు శ్రీదేవి, పిఓడబ్ల్యు నాయకులు ఝూన్సీ, న్యాయవాది ఎం లక్ష్మి, విఎఓల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రూపాదేవి, నాయకులు పరంజ్యోతి, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు, ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు, ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు రవీంద్రనాథ్‌, జి ఓబులేసు, ఐఎఫ్‌టియు రాష్ట్ర నాయకులు ప్రసాద్‌, కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, డివైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి రామన్న తదితరులు ఉన్నారు. నిరవధిక దీక్షల్లో ఉన్న అంగన్‌వాడీ వర్కర్ల సంఘాల నేతలు కె సుబ్బారావమ్మ, ఎన్‌ వాణిశ్రీ, రేఖా ఎలిజబెత్‌, టి గజలక్ష్మి, రేణుక, కారం రామలక్ష్మి, ఎం భూదేవి, జి కృపావరం, ఈ సరళాదేవి, ఎన్‌ సరోజమ్మ, వెంకట సుబ్బమ్మ, జె చంద్రకళ, వి ఆర్‌ జ్యోతి, జి భారతి, జె గంగాదేవిలను వారు పరామర్శించారు. ప్రభుత్వం దిగివచ్చేదాకా పోరాటాన్ని అంచెలుఅంచెలుగా ఉదృతం చేయాలని, అంగన్‌వాడీలు చేస్తున్న పోరాటాలకు తమ సంపూర్ణ మద్దతు వుంటుందని తెలిపారు.

➡️