ఆంధ్రప్రదేశ్‌కు రూ. 2,952.74 కోట్లు

Dec 23,2023 11:00 #money
  •  కేంద్ర పన్నుల వాటా కింద అదనపు నిధుల్ని విడుదల చేసిన కేంద్రం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర పన్నుల్లో వాటా కింద (స్టేట్స్‌ డివల్యూషన్‌ ఫండ్స్‌) కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ. 2,952.74 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే తెలంగాణకు రూ. 1,533.64 కోట్ల ను కేంద్రం రిలీజ్‌ చేసింది. దేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి రూ.72,961. 21 కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఈ వివరాలను శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. రాబోయే పండుగల సీజన్‌, కొత్త సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని వివిధ సామాజిక సంక్షేమ చర్యలు, మౌలిక సదుపాయల అభివృద్ధికి పథకాలకు నిధులు సమకూర్చుకోడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ నిధులు ఉపయోగపడతాయని పేర్కొంది. ఈనెల 11న విడుదల చేసిన నిధులకు, వచ్చే ఏడాది జనవరి 10న రాష్ట్రాలకు చెల్లించాల్సిన పన్ను పంపిణీకి ఈ నిధులు అదనం అని స్పష్టం చేసింది. కాగా అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌ కు రూ. 13,088 కోట్లు, తరువాత స్థానంలో బిహార్‌ కు రూ. 7,338.44 కోట్లు, మధ్య ప్రదేశ్‌ కు రూ. 5,727 కోట్లు, పశ్చిమ బెంగాల్‌ కు రూ. 5,488.88 కోట్లు, మహారాష్ట్రకు రూ. 4,608.96 కోట్లు, తమిళనాడుకు రూ. 2,976.10 కోట్లు, కర్ణాటకకు రూ. 2,660.88 కోట్లు, గుజరాత్‌ కు రూ.2,537 కోట్లు కేంద్రం విడుదల చేసింది.

➡️