షోకాజ్‌ నోటీసులతో భయపెట్టలేరు

anganwadi strike 37th day protest
  • అధికారులకు వివరణ ఇచ్చిన అంగన్‌వాడీలు 
  • రాష్ట్ర వ్యాప్తంగా 37వ రోజుకు చేరిన సమ్మె

ప్రజాశక్తి-యంత్రాంగం: పాదయాత్ర సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె బుధవారం నాటికి 37వ రోజుకు చేరింది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ అంగన్‌వాడీలు వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగించారు. ఐసిడిఎస్‌, సిడిపిఒ కార్యాలయాలను ముట్టడించారు. విధుల్లో చేరాలని ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్‌ నోటీసులకు ఐక్యంగా వివరణ ఇచ్చారు. చట్ట ప్రకారమే సమ్మె చేస్తున్నామని, సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించబోమని సమాధానం ఇచ్చారు. భిక్షాటనలు, ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. పలుచోట్ల సంతకాల సేకరణ చేపట్టారు. షోకాజ్‌ నోటీసులతో భయపెట్టలేరని, తమ సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో అంగన్‌వాడీలకు మద్దతుగా యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు మీగడ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. అంగన్‌వాడీల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడకపోతే భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు.

పశ్చిమగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్‌ నోటీసులను ఐసిడిఎస్‌ కార్యాలయ అధికారికి అందజేశారు. తణుకులో ర్యాలీ నిర్వహించి, సిడిపిఒ కార్యాలయంలో షోకాజ్‌ నోటీసులకు సమాధానం ఇచ్చారు. యలమంచిలిలో సంతకాలు సేకరించారు. ఏలూరులో ర్యాలీ నిర్వహించి, ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనంతరం సంతకాలు సేకరించారు. భీమడోలులో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. కైకలూరులో సిడిపిఒ కార్యాలయాన్ని ముట్టడించారు. బుట్టాయగూడెం, కొయ్యలగూడెం, చింతలపూడిలో సమ్మె శిబిరం నుంచి ఐసిడిఎస్‌ కార్యాలయానికి ప్రదర్శనగా వెళ్లి షోకాజ్‌ నోటీసులకు సమాధానం ఇచ్చారు. కలిదిండిలో ర్యాలీ చేశారు. విశాఖలో షోకాజ్‌ నోటీసులకు సమాధానాలు రాసి ర్యాలీగా ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయానికి చేరుకున్నారు. పెందుర్తి ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద షోకాజ్‌ నోటీసులతో మానవహారం, ఆందోళన చేపట్టారు. అనకాపల్లి జిల్లా మునగపాక, రాంబిల్లి మండల కేంద్రాల్లో ఆకులు నోటిలో పెట్టుకొని నిరసన తెలిపారు. కశింకోట, సబ్బవరంలో నిరసన ప్రదర్శన చేశారు. అల్లూరి జిల్లా పాడేరులో ర్యాలీ, డుంబ్రిగుడలో ఆందోళన చేశారు. విఆర్‌.పురం మండలం సున్నంవారిగూడెం, చిన్నమట్టపల్లి గ్రామాల్లో భిక్షాటనతో నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఐసిడిఎస్‌ కార్యాలయంలో అంగన్‌వాడీలు ఇచ్చిన రిప్లరు నోటీసులను అధికారులు తీసుకోకుండా తిరస్కరించడంతో కార్యాలయం గోడలకు రిప్లరు నోటీసులు అంటించారు. కోనసీమ జిల్లా రామచంద్రపురంలో సంతకాల సేకరణ చేపట్టారు. కడప కలెక్టరేట్‌ వద్ద నిరసన చేపట్టి, ర్యాలీగా సిడిపిఒ కార్యాలయానికి చేరుకుని షోకాజ్‌ నోటీసుకు సమాధాన పత్రాలు అందజేశారు. అన్నమయ్య కలెక్టరేట్‌ వద్ద రిలే దీక్షలు కొనసాగించారు. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో సంతకాల సేకరణ చేపట్టారు. కర్నూలు ధర్నాచౌక్‌లో సంతకాల సేకరణను గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ డాక్టర్‌ శంకర్‌ శర్మ ప్రారంభించారు. అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీలు వంటావార్పు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలో నిరసన దీక్షలను కొనసాగించారు. శ్రీకాకుళంలో సమ్మె శిబిరం వద్ద పొర్లు దండాలు పెడుతూ, ఇచ్ఛాపురంలో ఎండలోనే కూర్చొని నిరసన తెలిపారు. సరుబుజ్జిలిలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. నెల్లూరులో అంగన్‌వాడీల సమ్మెకు చిన్నారులు మద్దతు తెలిపారు. మెడలో పూలమాల వేసుకొని సమ్మె శిబిరంలో కూర్చున్నారు. జగన్‌ మామయ్య.. మా తల్లుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సమ్మెను కొనసాగించారు. అధికారులు ఇచ్చిన షోకాజ్‌ నోటీసులకు వివరణ ఇచ్చారు. గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట సమ్మె శిబిరంలో ఎఐటియుసి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వి.రాధాకష్ణమూర్తి మాట్లాడుతూ రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతుండగా జులైలో వేతనాలు పెంచుతామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్‌టిఆర్‌ జిల్లా వత్సవాయిలో సంతకాల సేకరణ చేపట్టారు. నందిగామలో ధర్నా చేశారు. కృష్ణా జిల్లాలో సమ్మెను కొనసాగించారు.

➡️