పదో రోజూ కొనసాగిన అంగన్‌వాడీల సమ్మె

Dec 22,2023 11:18 #10th day, #Anganwadi strike, #continued
  • పాతపట్నం ఎమ్మెల్యే కారు అడ్డగింత
  • వివిధ రూపాల్లో నిరసనలు

ప్రజాశక్తి- యంత్రాంగం : కనీస వేతనం రూ.26 వేలు, గ్రాట్యుటీ అమలు తదితర సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె గురువారానికి పదో రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో సిఎం జగన్‌ జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి కారును కొత్తూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద అడ్డుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే తన వద్దకు వచ్చి చెప్పాలని ఎమ్మెల్యే అన్నారు. కారు దిగి వస్తే చెప్పామని అంగన్‌వాడీలు బదులిచ్చారు. దీంతో, వారిని పక్కకు నెట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. అంగన్‌వాడీల వద్దకు ఎమ్మెల్యే వచ్చి మాట్లాడారు. సమస్యలను సిఎం పరిష్కరిస్తారని, అందుకు కొంతసమయం ఇవ్వాలని, సమ్మెను విరమించాలని కోరారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని అంగన్‌వాడీలు తేల్చి చెప్పడంతో ఎమ్మెల్యే తన కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. శ్రీకాకుళంలోని అర్బన్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద సమ్మె శిబిరాన్ని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు సందర్శించి సమ్మెకు సంఘీభావం తెలిపారు. అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాల్సి ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టడం సరికాదన్నారు. అంగన్‌వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్లు ఏళ్ల తరబడి సేవలందిస్తోన్న కనీస వేతనాలు అమలు చేయకపోవడం దారుణమన్నారు. బూర్జలో నాగావళి నదిలో అంగన్‌వాడీలు మానవహారం నిర్వహించారు. విజయనగరం జిల్లా గజపతినగరంలో అంగన్‌వాడీల పోరాటానికి మద్దతుగా పలువురు తల్లులు తమ పిల్లలతో కలిసి సమ్మెలో పాల్గొన్నారు. చిన్నారులంతా ‘జగన్‌ మామయ్యా… మా టీచర్ల జీతాలు పెంచండి’.. వారు సెంటర్‌కు వస్తేనే మేము కూడా సెంటర్‌కు వస్తాం..’ అంటూ పలకలపై రాసి నిరసన శిబిరంలో ప్రదర్శించారు. విశాఖలో జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద పదో నెంబర్‌ ఆకారంలో నిల్చొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అల్లూరి జిల్లా రంపచోడవరంలోని సమ్మె శిబిరంలో ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షులు జి.బేబిరాణి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీల సమస్యలపై చర్చలకు పిలిచి ఏ ఒక్క డిమాండ్‌నూ నెరవేర్చలేదన్నారు. విధిలేని పరిస్థితుల్లోనే సమ్మె కొనసాగించాల్సి వస్తోందని తెలిపారు.

అంగన్‌వాడీలపై రాంగోపాల్‌ వర్మ వ్యాఖ్యలను నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల సమ్మె శిబిరంలో ఆయన చిత్రపటాన్ని దహనం చేశారు. ఉండ్రాజవరం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద చిన్నారులతో కలిసి అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. కాకినాడలో సమ్మె శిబిరాన్ని 108 ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహ సందర్శించి మద్దతు ప్రకటించారు.

భీమవరంలో సమ్మె శిబిరాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం సందర్శించి సంఘీభావం తెలిపారు. అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం వద్ద డబ్బు లేదని చెబుతున్న మాటలు అవాస్తవమని, సంక్షేమ పథకాలకు బటన్‌ నొక్కుతున్న సిఎం జగన్‌ అంగన్‌వాడీలకు ఎందుకు బటన్‌ నొక్కట్లేదని ప్రశ్నించారు. వీరవాసరంలో అంగన్‌వాడీలు ఎండుగడ్డి తింటూ నిరసన తెలిపారు. నరసాపురంలో సమ్మె శిబిరాన్ని ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు (ఐవి) సందర్శించి సంఘీభావం తెలిపారు. సమస్యలు పరిష్కరించకపోతే రానున్న ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వానికి గుణపాఠం తప్పదన్నారు. పాటలు పాడి ఉద్యమం ఆవశ్యకతను వివరించి అంగన్‌వాడీల్లో మనోధైర్యాన్ని నింపారు. ఏలూరులో సమ్మెకు ఎల్‌ఐసి ఏజెంట్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి గొట్టాపు రవికిషోర్‌ మద్దతు తెలిపారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో అంగన్‌వాడీలు మోకాళ్లపై నిల్చొని ఆకులు తింటూ, పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో చెవిలో పువ్వులతో నిరసన తెలిపారు. బాపట్ల ఐసిడిఎస్‌ ప్రాజెక్టు వద్ద అంగన్‌వాడీల సమ్మె శిబిరాన్ని ఎమ్మెల్సీ లక్ష్మణరావు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఏం జరిగిందో మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని కోరారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగలగొడితే అంగన్‌వాడీల గుండెలు పగలగొట్టినట్టేనన్నారు. దర్శిలో అంగన్‌వాడీలు మానవహారం నిర్వహిస్తుండగా అనుమతి లేదంటూ పోలీసులు బెదిరించారు. నెల్లూరులో రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద అంగన్‌వాడీలు కొబ్బరికాయలు కొట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి జన్మదినోత్సవం రోజున హామీలు అమలు చేసే విధంగా బుద్ది పుట్టించాలని వేడుకున్నారు. అక్కడ నుంచి అంగన్‌వాడీ సెంటర్లలో ప్రీ స్కూల్‌ పిల్లలకు అందజేసే ఆహార పదార్థాలను ఒక మూటగా కట్టుకొని (ఇరుముడి) నెత్తిమీద పెట్టుకొని ప్రదర్శనగా ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె శిబిరానికి చేరుకున్నారు. వారి పోరాటానికి ఎంఎల్‌ఎ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేరుకొని సంఘీభావం తెలిపారు. వైఎస్‌ఆర్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లెలో పాపాఘ్ని నదిలో జలదీక్ష చేస్తూ, మైదుకూరులో పచ్చిగడ్డి తింటూ నిరసన తెలిపారు. అనంతపురం కలెక్టరేట్‌ వద్ద మనీప్లాంట్‌ మొక్కలను మెడకు చుట్టుకుని, పామిడి, రాయదుర్గంలో చెవిలో పూలు, బ్రహ్మసముద్రంలో కళ్లకు గంతలు కట్టుకుని, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో 10 నెంబర్‌ ఆకారంలో కూర్చొని నిరసన తెలియజేశారు.

ముఖ్యమంత్రికి వినతి

  • ప్రధాన డిమాండ్లపై స్పందించకపోవడంతో నల్ల బెలూన్లతో నిరసన

ప్రజాశక్తి- చింతపల్లి (అల్లూరి జిల్లా) : అల్లూరి సీతారాజరాజు జిల్లా చింతపల్లి వేదికగా ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు గురువారం వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి అంగన్‌వాడీ సమస్యలపై చింతపల్లి ప్రాజెక్టు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పెంటమ్మ, రాములమ్మ వినతిపత్రం అందజేశారు. వాటిని పరిష్కరించాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ, ఒక్కొక్కటీ పరిష్కరిస్తున్నామని, అన్నీ పరిష్కారం చేయడానికి ఆలోచిస్తామని బదులిచ్చారు. ప్రధాన డిమాండ్లు అయిన వేతనం పెంపు వంటివాటిపై స్పష్టమైన హామీ ఇవ్వలేదు. దీంతో, అంగన్‌వాడీలు ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట నల్లబెలూన్లతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు చిన్నయ్యపడాల్‌ పాల్గొన్నారు.

➡️