మ్యానిఫెస్టోలో అంగన్‌వాడీల అంశం

Dec 30,2023 20:55 #Nara Chandrababu, #speech

– కుప్పంలో చంద్రబాబు ఉద్ఘాటన

ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో  కుప్పం: ‘మీ డిమాండ్లు న్యాయసమ్మతం, టిడిపి మ్యానిఫెస్టోలో అంగన్‌వాడీల అంశం చేరుస్తాం’ అని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు. 20 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఆందోళనకరమన్నారు. కుప్పం సిడిపిఒ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీలను శనివారం కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ మీకు అండగా ఉంటాం.. న్యాయమైన కోర్కెల కోసం పోరాడతాం.. జగన్‌ ప్రభుత్వం అత్యంత దుర్మారంగా వ్యవహరిస్తోంది. ఆవేదనకు గురై కొందరు మృతిచెందారు. అధైర్యపడకండి.. మీ పోరాటం విజయవంతమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీల పోరాటానికి టిడిపి అండగా ఉంటుంది’ అని అన్నారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీలు మాట్లాడుతూ.. అంగన్‌వాడీల పట్ల జగన్‌ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, న్యాయమైన కోర్కెల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు పోరాటాన్ని తక్కువ చేసి చూస్తోందన్నారు. కుప్పం ప్రాజెక్టులో ఓ సూపర్‌వైజర్‌ వేధింపులకు గురిచేస్తున్నారని, సమ్మెలో ఉన్న 80 మంది అంగన్‌వాడీలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారని తెలిపారు. చంద్రబాబు స్పందిస్తూ.. ప్రభుత్వం ట్రస్టీగా వ్యవహరించి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని, అలా కాకుండా పోరాటాలను అణచివేసేలా ప్రవర్తించడం జగన్‌ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంతో పాటు, వేధింపులకు గురిచేస్తోన్న అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగిస్తే తమ ప్రభుత్వం వచ్చిన తరువాత తిరిగి తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు లలిత, కస్తూరి, సరళ, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

➡️