‘జిందాల్‌’తో రహస్య ఒప్పందంపై ఆగ్రహం : పూర్తి వివరాలు బయటపెట్టాలంటూ స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల ధర్నా

Dec 19,2023 09:42 #jindal, #Steel plant workers, #strike

ప్రజాశక్తి- ఉక్కునగరం (విశాఖపట్నం), అమరావతి బ్యూరో : విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3ని నడిపేందుకు జిందాల్‌ సంస్థతో చేసుకున్న రహస్య ఒప్పందాన్ని బయటపెట్టాలని డిమాండ్‌ చేస్తూ ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యాన స్టీల్‌ప్లాంట్‌ ప్రధాన రహదారిలో కార్మికులు సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరామ్‌ మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ అమ్మకం ఆగిందని ప్రచారం చేస్తూనే, స్టీల్‌ప్లాంట్‌ సిఎండి ఢిల్లీలో కూర్చుని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చించాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. రూ.3 లక్షల కోట్ల విలువైన ప్లాంట్‌ను రూ.500 కోట్ల కోసం తాకట్టు పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్‌ప్లాంట్‌కు ఎన్‌ఎండిసి నుంచి ముడి సరుకులు, సొంత గనులు కేటాయిస్తే కార్మికులంతా కలిసి ఉత్పత్తి సాగించి రూ.9 వేల కోట్లను కట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జిందాల్‌ రావడంలేదని, సెయిల్‌తో మాట్లాడుతున్నా మని ఈ నెల రెండో తేదీన చెప్పారని, ఇంతలోపే ఏం జరిగిందని ప్రశ్నించారు. ఢిల్లీ పెద్దల సమక్షంలో జరుగుతున్న రహస్య ఒప్పందాలను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను నడిపేందుకు రూ.1,200 కోట్లు సరిపోతాయని సిఎండి స్వయంగా చెప్పారని, ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తే ఆ నిధులు సమీకరించడం పెద్ద కష్టం కాదని తెలిపారు. ఎన్‌ఎండిసికి రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తీర్చారని, బ్యాంకులకు రుణాలు కడుతున్నారని, జిఎస్‌టి చెల్లిస్తున్నారని, కార్మికులకు జీతాలు ఇచ్చేందుకు నగదు లేదని చెప్పి భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కార్మిక వర్గం పోరాడి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుంటుందని స్పష్టం చేశారు. సిపిఎం కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ కుట్రలో భాగంగానే ఆగమేఘాల మీద సిఎండిని ఢిల్లీకి పిలిపించుకొని చర్చలు జరపాలని విమర్శించారు. ఈ రహస్య ఒప్పందాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ కుట్రలను ఐక్య పోరాటాలతో తిప్పికొడతామన్నారు. కార్యక్రమంలో ఉక్కు కార్మిక సంఘాల నాయకులు యు.రామస్వామి, వరసాల శ్రీనివాసరావు, జె.రామకృష్ణ పాల్గొన్నారు. చీకటి ఒప్పందం దారుణం : సిపిఎంస్టీల్‌ప్లాంట్‌-జిందాల్‌ మధ్య చీకటి ఒప్పందం దారుణమని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు అన్నారు. విశాఖలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్రం ఇంతటి ద్రోహానికి పూనుకుంటే సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. వార్తలను ఖండించిన స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యంకార్మిక సంఘాల వివరాల ఆధారంగా స్టీల్‌ప్లాంట్‌పై కొన్ని మీడియా సంస్థలు వార్తలను ప్రచురించడాన్ని వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం ఖండించింది. స్టీల్‌ ప్లాంట్‌ మేనేజ్‌మెంట్‌ ఈ నెల 30న మూడో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను పున:ప్రారంభించేందుకు నూతన ప్రణాళికలతోనే ముందుకు వెళ్తోందని వెల్లడించింది. స్టీల్‌ప్లాంట్‌ అధికారిక వర్గాల నుంచి వాస్తవాలను ధ్రువీకరించుకోవాలని మీడియా సంస్థలను కోరింది.

ప్లాంటులోకి జిందాల్‌ కంపెనీని రానివ్వం : సిఐటియు

విశాఖ స్టీలు ప్లాంటులోకి జిందాల్‌ కంపెనీని రానివ్వబోమని సిఐటియు రాష్ట్ర కమిటీ హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎవి.నాగేశ్వరరావు, సిహెచ్‌.నరసింగరావు సోమవారం ప్రకటన విడుదల చేశారు. స్టీలు ప్లాంట్‌కు గుండెకాయ వంటి బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3 కేంద్ర ప్రభుత్వం నిలిపేయడంతో ఉత్పత్తి 30 శాతానికిపైగా రెండేళ్లు తగ్గి నష్టాలను పెంచిందని పేర్కొన్నారు. పోస్కో, జిందాల్‌ వంటి సంస్థలను అడ్డం పెట్టుకుని వ్యవహారం నడుపుతున్నాయని విమర్శించారు. నిజంగా ప్లాంట్‌ను నడపాలనుకుంటే రూ.1200 కోట్లు అప్పు తీసుకోవడానికి అనుమతిస్తే చాలని, 22 నెలల నుండి ఈ పనిచేయడం లేదని తెలిపారు. దీనిపై ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3 నిర్వహణ బాధ్యతను స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌)కు అప్పగించాలని కోరారు.

➡️