అర్హులందరికీ మరో అవకాశం

Jan 5,2024 21:45 #ap cm jagan, #speech

సంక్షేమ పథకాల విడుదలలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి

ఆరునెలలకోసారి సమీక్ష

1.11 లక్షల మందికి బియ్యం కార్డులు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :అర్హులై ఉండి సంక్షేమ పథకాలు అందని వారికి మరో అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. ఆగస్టు 2023 నుండి డిసెంబరు వరకు అర్హులైన వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారులకు రూ.97.76 కోట్లను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయం నుండి శుక్రవారం బటన్‌నొక్కడం ద్వారా వారి ఖాతాల్లో జమచేశారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ అర్హులకు పథకం అందకపోతే నెలరోజుల తరువాత వారితో మరలా దరఖాస్తు పెట్టించి ఆరునెలల్లోపు వారికి లబ్ది అందజేయాలన్నారు. దరఖాస్తులోపం వల్లే అధార్‌ తో అనుసంధానం కాకుండా ఆగిన వారందరికీ అందచేస్తామన్నారు. 2021 నుండి ఐదు పర్యాయాల్లో అర్హత ఉండి పొరపాటున మిస్‌ అయిన లబ్దిదారులకు రూ.1700 కోట్లు ఇప్పటివరకు అందచేసినట్లు తెలిపారు. ఇప్పుడు కొత్తగా 68,990 మందికి రూ.98 కోట్లు లబ్ది కల్పిస్తున్నామని చెప్పారు. అమ్మఒడి కింద మిస్‌ అయిన వారిలో 40,616 మందికి కూడా డబ్బులు అందజేస్తున్నామని పేర్కొన్నారు. జగనన్న చేదోడు, ఇబిసి నేస్తం, వాహనమిత్ర, మత్య్సకార భరోసా, కళ్యాణమస్తు, షాదీతోఫా, కాపునేస్తం, నేతన్ననేస్తం వంటి పథకాల్లో మిగిలిపోయిన వారికి నేడు అందించామని తెలిపారు. ఈనెల నుండి 1,11,321 మందికి కొత్త రేషన్‌కార్డులు అందిస్తున్నామని వివరించారు. మరోవైపు 6,314 మందికి కొత్త ఆరోగ్యశ్రీకార్డులు, 34,623 మందికి ఇళ్లస్థలాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. కలెక్టర్‌ నుండి సచివాలయ సిబ్బంది వరకూ ఎవరూ మిగిలిపోకుండా చూసే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్‌, సిఎస్‌ జవహర్‌రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అనంతరాము, అజేయ్ జైన్‌, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శులు ప్రవీణ్‌ప్రకాష్‌, సునీత తదితరులు పాల్గొన్నారు.

➡️