మరో గిరిజన బాలుడు మృతి

Jan 23,2024 10:59 #boy death, #trible

ప్రజాశక్తి- శృంగవరపుకోట (విజయనగరం జిల్లా) : రహదారి సౌకర్యం లేని మూలబొడ్డవర పంచాయతీ చిట్టెంపాడు గ్రామంలో మరో గిరిజన చిన్నారి కన్నుమూశాడు. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న జన్ని ప్రవీణ్‌ (6 నెలలు)ను తల్లిదండ్రులు ఏడు కిలోమీటర్లు కొండ దించి, పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో ఒకరోజు వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం విజయనగరంలోని ఘోషాస్పత్రికి అక్కడి వైద్యులు పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందాడని బాలుడు తండ్రి సన్యాసిరావు, తల్లి సన్యాసమ్మ తెలిపారు. చిన్నారి మృతదేహాన్ని ప్రయివేటు వాహనంలో బొడ్డవర రైల్వే స్టేషన్‌ వరకు, అక్కడి నుంచి కొండపైకి తీసుకెళ్లారు. ఈ నెల 5న ఇదే గ్రామానికి చెందిన మాదల గంగమ్మను, ఆమె ఆరు నెలల చిన్నారిని విశాఖ తరలించగా, 5వ తేదీన బిడ్డ, 16న తల్లి మృతి చెందిన విషయం విదితమే. వరుస మరణాలతో గ్రామంలో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. వైద్యాధికారులు స్పందించి వైద్య సేవలందించాలని కోరుతున్నారు.

➡️