తెలుగు విద్యార్థులను రప్పించేందుకు కిర్గిజ్‌స్థాన్‌ నుంచి 2 విమానాలు – ఎపి ఎన్‌ఆర్‌టి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :కిర్గిజ్‌స్థాన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎపి ఎన్‌ఆర్‌టి సొసైటీ సిఇఒ హేమలత తెలిపారు. విదేశీ వ్యవహారాలశాఖ గురువారం నుంచి కిర్గిజ్‌స్థాన్‌లోని బిష్కెక్‌ నుంచి ఢిల్లీకి నేరుగా రెండు విమానాలు నడుపుతోందని ఒక ప్రకటనలో వెల్లడించారు. అక్కడి తెలుగు విద్యార్థులతో తమ సొసైటీ నిరంతరం మాట్లాడుతూ.. కౌన్సెలింగ్‌ ఇస్తోందని తెలిపారు. విద్యార్థుల భద్రతపై ఎప్పటికప్పుడు విదేశీ వ్యవహారాలశాఖకు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉన్నందున విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చే ముందు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. కిర్గిజ్‌స్థాన్‌లోని భారతీయ విద్యార్థులు బిష్కెక్‌లోని రాయబార కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు.

➡️