భూముల ఆక్రమణలపై విచారణకు సిద్ధమా ?

May 26,2024 20:30 #Murthy Yadav, #press meet
  • సిఎస్‌కు జనసేన కార్పొరేటర్‌ మూర్తియాదవ్‌ సవాల్‌

ప్రజాశక్తి – సీతమ్మధార (విశాఖపట్నం) : ఉత్తరాంధ్రలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌.జవహర్‌రెడ్డి కుమారుడు బినామీలతో 800 ఎకరాల భూములను కాజేశారని, దీనిపై సిబిఐతోగానీ, సిట్టింగ్‌ జడ్జితోగానీ విచారణకు సిఎస్‌ సిద్ధమా ? అని జనసేన పార్టీ కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ సవాలు విసిరారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పేద రైతుల అసైన్డ్‌ భూములను అన్యాయంగా లాక్కున్నారని ఆరోపించారు. తాను చేసిన ఆరోపణలు అవాస్తమైతే ఏ శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు. సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి ముందు జవహర్‌రెడ్డి స్వామి దర్శనం చేసుకున్నారని, ఆ తరువాత ఎక్కడికి వెళ్లారో తనకు తెలుసని అన్నారు. కుమారుడిని ముందే పంపి అన్ని అగ్రిమెంట్లూ సిఎస్‌ చేసుకున్నారని, భోగాపురం సమీపంలోని కంచర్లలో అనుమతులు మంజూరు చేస్తూ విజయనగరం ప్రస్తుత కలెక్టర్‌ నాగలక్ష్మి ప్రొసీడింగ్స్‌ కూడా ఇచ్చారని తెలిపారు. విజయనగరం జిల్లా పూసపాటరేగ మండలం ఇరుకొండ, చినబత్తిలి, తదితర గామాలతోపాటు విశాఖ జిల్లాలోని భీమిలి, పద్మనాభం మండలాల్లో అయినాడ, పాండ్రంగి, తిమ్మాపురం ప్రాంతాల్లో ఫ్రీ హోల్ట్‌ సర్టిఫికెట్లు కూడా ఇచ్చేశారని చెప్పారు. వైసిపి నాయకులు విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఫ్రీ హోల్డ్‌ సర్టిఫికెట్లు తీసుకుని దోచేశారని ఆరోపించారు. జిఒ నెంబర్‌ 596 వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు జరిగిన లావాదేవీలపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. సిఎం జగన్‌ సతీమణి భారతి పేరు చెప్పి కొన్ని లావాదేవీలు జరిగేలా చేశారన్నారు. భూ వ్యవహారాల్లో వెనుక ఉండి కథ నడిపిన తహశీల్దార్ల పేర్లు త్వరలో బయటపెడతానని చెప్పారు.

➡️