ఎన్నికల యుద్ధ బాణాలు .. సంక్షేమ పథకాలే

  • ప్రతి ఇంటి నుండి స్టార్‌ క్యాంపెయినర్‌ రావాలి
  • ‘సిద్ధం’ సభలో సిఎం జగన్‌

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : పొత్తులు పెట్టుకోకపోతే రాష్ట్రంలోని ఆ రెండు పార్టీలకూ అభ్యర్థులే లేరని టిడిపి, జనసేన పార్టీలను ఉద్దేశించి రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రతి ఇంటి నుంచి వైసిపికి స్టార్‌ క్యాంపెయినర్‌ రావాలని కోరారు. విశాఖ జిల్లా భీమునిపట్నం నియోజకవర్గం సంగివలస వద్ద శనివారం జరిగిన వైసిపి ఉత్తరాంధ్ర క్యాడర్‌ సభలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే ప్రతిపక్షాలపై యుద్ధ బాణాలుగా మారాలంటూ ఎన్నికల నగారా మోగించారు. ‘ఎన్నికలకు నేను సిద్ధం. మీరు సిద్ధమా? అంటూ పదేపదే కార్యకర్తలతో చప్పట్లు కొట్టిస్తూ వేదిక పైనుంచే సమర శంఖం పూరించారు. వచ్చే 70 రోజులూ నిత్యం యుద్ధమేనని, మీరంతా సిద్ధంగా ఉండాలని కార్యకర్తలను కోరారు. ‘సుపరిపాలనలో మనమెక్కడ.. చంద్రబాబెక్కడీ ఆయనది దుర్మార్గపు చరిత్ర. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు మార్క్‌ ఎక్కడైనా ఉందా? 2014 ఎన్నికల్లో గెలిచాక అభివృద్ధి, సంక్షేమాన్ని చాపచుట్టేసి రాష్ట్రానికి పెద్ద సున్నా చూపించాడు. గడిచిన 56 నెలల వైసిపి పాలనలో జరిగిన సంక్షేమం దేశంలో ఎక్కడా జరగలేదు. రూ.2.53 లక్షల కోట్ల సంక్షేమ పథకాలకు బటన్‌ నొక్కాం. నేను మీకు (కార్యకర్తలకు), ప్రజలందరికీ మంచి సేవకుడను’ అని అన్నారు. ఆ రెండూ జనంలోలేని దిగజారుడు పార్టీలని, ఆ నాయకులు పెత్తందారీ వర్గానికి ప్రతినిధులని చంద్రబాబు, పవన్‌ను ఉద్దేశించి విమర్శించారు. వీరంతా కలసి ప్రభుత్వంపై తప్పుడు ప్రచార ఆయుధాలతో దాడికి వస్తున్నారని, ఒంటరిగా ఎదుర్కొనడానికి తాను సిద్ధమని ప్రకటించారు. ప్రతి ఇంటికీ, ప్రతి గ్రామానికీ తన పాలనలో సంక్షేమం అందిందని, 60 శాతం ప్రజలు తమతోనే ఉన్నారని అన్నారు. ప్రతి ఇంటి నుంచీ ఒక స్టార్‌ క్యాంపెయినర్‌ వైసిపి కోసం వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో 2019లో గెలిచాక తాను మార్పు తెచ్చానని, వివక్ష, లంచాల్లేని పాలన అందిస్తున్నానని అన్నారు. రానున్న ఎన్నికలు పేదరికం నుంచి ప్రజలను బయటకు తెచ్చేవని, చదువుకునే పిల్లల తలరాతలు మార్చేవని పేర్కొన్నారు. ప్రతి ఇంటికీ 12 గ్యాస్‌ సిలిండర్లు ఇస్తానని, బ్యాంకుల్లో దాచుకున్న బంగారం విడిపిస్తానని చెప్పి 2014లో చంద్రబాబు చెప్పారని, గెలిచాక ఈ హామీలను అమలు చేయలేదని అన్నారు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకూ మార్పు తెచ్చాంతమ ప్రభుత్వంలో కుప్పం మొదలుకుని ఇచ్ఛాపురం వరకూ అవినీతి, లంచం, వివక్షలేని పౌరసేవలు అందించి, సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఈ కాలంలో చేరువయ్యామని జగన్‌ అన్నారు. 2019లో వారికొచ్చిన 23 స్థానాలు కూడా ఈసారి వారికి రావన్నారు. 75 రోజుల్లో జరిగే ఎన్నికల యుద్ధం అబద్ధానికీ.. నిజానికీ, టిడిపి మోసానికీ.. వైసిపి విశ్వసనీయతకూ మధ్య సాగే యుద్ధమని పేర్కొన్నారు. బాబుకు ఓటేయాలని ఎవరైనా అనుకుంటే సంక్షేమ పథకాలను రద్దు కోరుకునేవాళ్లేనని అన్నారు.

జనం మధ్యకు జగన్‌

సంగివలసలో జరిగిన సభలో ఇరువైపులా క్యాడర్‌కు అభివాదం చేస్తూ వారిని దగ్గర్నుంచి పలుకరించేలాగ స్టేజీకి ఎదురుగా, సభా ప్రాంగణం మధ్యలోంచి ఒక ర్యాంప్‌ను ఏర్పాటు చేశారు. జగన్‌ సభా వేదిక వద్దకు మధ్యాహ్నం 3.45 గంటలకు రాగానే ఒకసారికార్యకర్తల చప్పట్లు, కేరింతలు, నినాదాల మధ్య దీనిపై నడుస్తూ వారందరికీ అభివాదం చేశారు. తన ప్రసంగం ముగిసిన తర్వాత కూడా ఇలాగే సాయంత్రం 5.25 గంటలకు చేశారు. భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, విడదల రజని, గుడివాడ అమర్‌నాథ్‌, బూడి ముత్యాలనాయుడు, రాజన్నదొర, సీదిరి అప్పలరాజు, వైసిపి ఉత్తరాంధ్ర కో-ఆర్డినేటర్‌ వైవి.సుబ్బారెడ్డి, ఎంపి ఎంవివి సత్యనారాయణ, ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. చేశారు. జగన్‌ సభా వేదిక వద్దకు మధ్యాహ్నం 3.45 గంటలకు రాగానే ఒకసారికార్యకర్తల చప్పట్లు, కేరింతలు, నినాదాల మధ్య దీనిపై నడుస్తూ వారందరికీ అభివాదం చేశారు. తన ప్రసంగం ముగిసిన తర్వాత కూడా ఇలాగే సాయంత్రం 5.25 గంటలకు చేశారు. భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, విడదల రజని, గుడివాడ అమర్‌నాథ్‌, బూడి ముత్యాలనాయుడు, రాజన్నదొర, సీదిరి అప్పలరాజు, వైసిపి ఉత్తరాంధ్ర కో-ఆర్డినేటర్‌ వైవి.సుబ్బారెడ్డి, ఎంపి ఎంవివి సత్యనారాయణ, ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

➡️